ఏషియన్ గేమ్స్ 2026 రేస్ నుంచి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ ఔట్

ఏషియన్ గేమ్స్ 2026 రేస్ నుంచి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ ఔట్

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‎కు బిగ్ షాక్ తగిలింది. ఏసియన్ గేమ్స్ 2026 రేస్ నుంచి ఆమె నిష్క్రమించారు. మహిళల 53 కేజీల ట్రయల్స్ సెమీఫైనల్‌లో మీనాక్షి గోయత్ చేతిలో 6-4 తేడాతో వినేష్ ఫొగట్ ఓటమి పాలయ్యారు. దీంతో 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో చోటు దక్కించుకోవాలన్న ఫోగట్ ఆశలు ఆవిరయ్యాయి.

శుక్రవారం ( మే 30) న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో వినేష్ ఫొగట్, మీనాక్షి గోయత్ హోరాహోరీగా తలపడ్డారు. పాయింట్ల కోసం ఇద్దరు తీవ్రంగా శ్రమించారు. మీనాక్షి కీలక సమయాల్లో సంయమనం కోల్పోకుండా ఆచితూచి వ్యవహరించి 6-4 తేడాతో వినేష్ ఫొగట్‎ను చిత్తు చేసి ఫైనల్‏కు దూసుకెళ్లింది.

 దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వివాదాలను ఎదుర్కొని, కోర్టు ఆదేశాలతో ట్రయల్స్‎కు వచ్చిన వినేష్ ఫొగట్‎కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఓటమి అనంతరం రింగ్‎ను వీడుతూ ‘మై ఫిర్ ఆగీ’ (నేను తిరిగి వస్తాను) అని ఫొగట్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ తర్వాత వినేష్ ఫొగట్ బరిలోకి దిగడం ఇదే తొలిసారి. 

వివాదం ఏంటంటే..?

ప్రసూతి విరామం కారణంగా కీలక టోర్నమెంట్లకు దూరమైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‎ను 2026 ఆసియా క్రీడలకు డబ్ల్యూఎఫ్ఎ అనర్హురాలిగా ప్రకటించింది. డబ్ల్యూఎఫ్ఎ ఆదేశాలను వినేష్ ఫొగట్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఢిల్లీ హైకోర్టులో ఆమెకు ఊరట దక్కింది. వినేశ్ ఫొగట్ను దేశీయ పోటీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటిస్తూ రెజ్లింగ్ సమాఖ్య తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్లో ఆమె పాల్గొనేలా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటర్నేషనల్ బాడీ నుంచి అనుమతి ఉన్నప్పటికీ వినేశ్ను ట్రయల్స్లో పాల్గొనకుండా అడ్డుకోవడం సరికాదని తప్పుబట్టింది. ప్రసవ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగాలని భావిస్తున్న వినేశ్ ఇంటర్నేషనల్ స్థాయి రెజ్లర్ అని, తల్లి అయినందుకు ఆమెను పక్కనపెట్టడం తగదని కోర్టు హితవు పలికింది. మన దేశంలో మాతృత్వాన్ని గౌరవిస్తారని, సమాఖ్య కక్షసాధింపు ధోరణితో వ్యవహరించకూడదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

దీంతో ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్లో వినేష్ ఫొగట్ పాల్గొనేలా ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను డబ్ల్యూఎఫ్ఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. డబ్ల్యూఎఫ్ఎ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం (మే 29) జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు వినేష్ ఫొగటు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వినేష్ ఫోగట్‎కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై స్టే విధించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేమని.. ఆసియా క్రీడల కోసం జరగనున్న సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు వినేష్ ఫోగాట్‎కు అనుమతి ఇవ్వబడుతుందని ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

వినేష్ ఫొగట్ రీ ఎంట్రీ గురించి సరైన సమాచారం ఇవ్వలేదని.. అంతేకాకుండా డోపింగ్ టెస్ట్‎లో పాల్గొనకపోవడం ఆందోళనకరమైన విషయమని కోర్టు పేర్కొంది. అయినప్పటికీ ఆసియా గేమ్స్ ట్రయల్స్‎లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతి ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో 2026, మే 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల ట్రయల్స్‎లో పార్టిసిపేట్ చేసేందుకు పొగట్‎కు లైన్ క్లియర్ అయ్యింది. కానీ ట్రయల్స్ సెమీ ఫైనల్‎లో ఓటమి పాలు కావడంతో ఆసియా గేమ్స్‎లో పాల్గొనాలన్న ఫొగట్ ఆశలు ఆవిరయ్యాయి.