న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆసియా క్రీడల ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వినేష్ ఫోగట్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై స్టే విధించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో 2026, మే 30న ఢిల్లీలో ప్రారంభమయ్యే ఆసియాడ్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఫోగాట్‌కు మార్గం సుగమమైంది.
వివాదం ఏంటంటే..?
ప్రసూతి విరామం కారణంగా కీలక టోర్నమెంట్లకు దూరమైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‌ను 2026 ఆసియా క్రీడలకు డబ్ల్యూఎఫ్ఐ అనర్హురాలిగా ప్రకటించింది. డబ్ల్యూఎఫ్ఐ ఆదేశాలను వినేష్ ఫొగట్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఢిల్లీ హైకోర్టులో ఆమెకు ఊరట దక్కింది. వినేశ్ ఫొగట్‌ను దేశీయ పోటీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటిస్తూ రెజ్లింగ్ సమాఖ్య తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాబోయే ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఆమె పాల్గొనేలా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్నేషనల్ బాడీ నుంచి అనుమతి ఉన్నప్పటికీ వినేశ్‌ను ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకోవడం సరికాదని తప్పుబట్టింది. ప్రసవ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగాలని భావిస్తున్న వినేశ్ ఇంటర్నేషనల్ స్థాయి రెజ్లర్ అని, తల్లి అయినందుకు ఆమెను పక్కనపెట్టడం తగదని కోర్టు హితవు పలికింది. మన దేశంలో మాతృత్వాన్ని గౌరవిస్తారని, సమాఖ్య కక్షసాధింపు ధోరణితో వ్యవహరించకూడదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
దీంతో ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో వినేష్ ఫొగట్ పాల్గొనేలా ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను డబ్ల్యూఎఫ్ఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం (మే 29) జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఆసియా క్రీడల ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేష్ ఫొగట్‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వినేష్ ఫోగట్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై స్టే విధించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో మేం జోక్యం చేసుకోలేమని.. ఆసియా క్రీడల కోసం జరగనున్న సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేష్ ఫోగాట్‌కు అనుమతి ఇవ్వబడుతుందని ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ALSO READ : IPL 2026 ఫైనల్కి ముందు చిక్కుల్లో కోహ్లీ..
వినేష్ ఫొగట్ రీ ఎంట్రీ గురించి సరైన సమాచారం ఇవ్వలేదని.. అంతేకాకుండా డోపింగ్ టెస్ట్ లో పాల్గొనకపోవడం ఆందోళనకరమైన విషయమని కోర్టు పేర్కొంది. అయినప్పటికీ ఆసియా గేమ్స్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతి ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో 2026, మే 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల ట్రయల్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు ఫొగట్‌కు లైన్ క్లియర్ అయ్యింది.
