పటియాల : ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీ కోసం సోమవారం నిర్వహించిన ట్రయల్స్‌లో హై డ్రామా నడిచింది. రెండు వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో పోటీపడ్డ వినేశ్.. ట్రయల్స్ తర్వాత డోప్ టెస్టుకు హాజరు కాకపోవడం వివాదం రేపింది. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వినేశ్ 50 కేజీ కేటగిరీ ట్రయల్స్‌లో 11-6తో శివానీపై గెలిచి ఏప్రిల్‌లో కిర్గిస్థాన్ వేదికగా జరిగే ఆసియా క్వాలిఫయర్స్ టోర్నీకి అర్హత సాధించింది. వినేశ్ 53 కేజీ ట్రయల్స్‌లోనూ పోటీ పడింది. రెండు కేటగిరీల్లో పోటీకి తనకు అనుమతి ఇవ్వాలన్న డిమాండ్‌తో వినేశ్ మూడు గంటల పాటు ట్రయల్స్ ప్రారంభం కాకుండా అడ్డుకుంది. చివరకు పలు దఫాల చర్చల తర్వాత ఐవోఏ అడ్‌హాక్ కమిటీ వినేశ్‌కు రెండింటిలో పోటీకి అనుమతి ఇచ్చింది. అయితే ట్రయల్స్ తర్వాత డోప్ టెస్టు కోసం కోసం శాంపిల్స్ ఇచ్చేందుకు వినేశ్ నిరాకరించింది.
