న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు ఇండియా రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) గట్టి షాక్ ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యం, డోపింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చే అథ్లెట్లు పాటించాల్సిన ఆరు నెలల నోటీసు గడువును పూర్తి చేయనందున ఆమెను 26 జూన్ 2026 వరకు డొమెస్టిక్ పోటీల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది. దాంతో గోండాలో ఆదివారం ప్రారంభం కానున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో తిరిగి బరిలోకి దిగాలన్న వినేశ్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడిన తర్వాత వినేశ్ ప్రవర్తన ఇండియా రెజ్లింగ్ ప్రతిష్టకు తీరని నష్టం కలిగించింది.
డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగం, అంతర్జాతీయ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) రూల్స్‌ను ఆమె పట్టించుకోలేదు. వాడా నిబంధనలను కూడా పక్కనబెట్టింది’ అని డబ్ల్యూఎఫ్‌లో తన 15 పేజీల షోకాజ్ నోటీసులో పేర్కొంది. తాను తిరిగి రెజ్లింగ్‌లోకి వస్తున్నట్లు వినేశ్12 డిసెంబర్ 2025న వెల్లడించినా.. రూల్స్ ప్రకారం ఆరు నెలల గడువు పూర్తి కాలేదు. దాంతో పాటు డిసెంబర్ 18న డోపింగ్ పరీక్షల కోసం అధికారులు ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. గతంలోనూ ఓసారి ఇలాగే జరగడంతో వాడా నోటీసులు ఇచ్చింది. దాంతో పోటీలకు తాను అర్హురాలినేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత వినేశ్‌పై ఉందని డబ్ల్యూఎఫ్‌ఐ స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు వినేశ్‌కు 14 రోజుల గడువు ఇచ్చింది.
