ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్​ అగ్రవర్ణాల ఏజెంట్ : వినోద్ కుమార్

ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్​ అగ్రవర్ణాల ఏజెంట్ : వినోద్ కుమార్
  • దళిత, క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ గాలి వినోద్ కుమార్ విమర్శ

సికింద్రాబాద్, వెలుగు: బీఎస్పీ చీఫ్​ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్​అగ్రవర్ణాల ఏజెంట్​గా మారి, బహుజనుల నమ్మకాన్ని వమ్ము చేశాడని దళిత, క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు. గురువారం ఆయన తార్నాకలో మీడియాతో మాట్లాడారు. మొన్నటి దాకా నియంత పాలనను, దొరల గడీలను కూలగొట్టి, ఏనుగుపై అసెంబ్లీకి పోతానని, సీఎం అవుతానని చెప్పిన ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్​తన స్వార్థం కోసం అనైతికంగా బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకున్నాడన్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు బీజేపీకి మేలు చేస్తుందని, తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దళితుల సాంప్రదాయ, కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే ఇలా చేశారని మండిపడ్డారు. బహుజనులు అధికారంలోకి రాకుండా ప్రవీణ్​కుమార్ అడ్డుగా మారాడన్నారు. ఎస్సీ వర్గీకరణ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నవారికి మద్దతు ఇవ్వని వ్యక్తి, అగ్రవర్ణ పేదలకు ఉపయోగపడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించడం బహుజనులను మోసం చేయడమేనన్నారు. ప్రవీణ్​కుమార్​కు ఇటు సిద్ధాంతం పరంగా, అటు రాజకీయం పరంగా ఏమాత్రం నైతికత లేదని విమర్శించారు.