
గన్నేరువరం, వెలుగు: ‘మన ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో ఎక్కడైనా గెలవరు అంటేనే మారుస్తా.. లేదంటే సిట్టింగులకే సీట్లు ఇచ్చి గెలిపించుకుంటా..” అని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారని, త్వరలోనే క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేయబోతున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో డబుల్ రోడ్డు శంకుస్థాపన సభలో.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ దక్కేలా చూడాలని, గెలిచినంక మంత్రి పదవి వచ్చేలా చొరవ చూపాలని వినోద్‌కుమార్‌ను జడ్పీటీసీ రవీందర్ రెడ్డి కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. ఇప్పుడే అనౌన్స్ చేయమంటే కుదరదని, ఎవరికి టికెట్.. ఎవరికి ఏ పదవి ఇచ్చేది కేసీఆర్ చేతుల్లోనే ఉంటుందని సమాధానం దాటవేశారు. తాను కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లి చెప్పేటోడిని మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే పార్టీలో అందరికీ గౌరవం ఉంటుందని, మాజీ ఎమ్మెల్యే మోహన్ అంటే సీఎం గౌరవిస్తారని, ఎంపీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్‌లోకి వచ్చిన ఆయనకు ప్రాధాన్యం దక్కుతుందన్నారు. రసమయి టికెట్ విషయంలో వినోద్ క్లారిటీ ఇవ్వకపోవడంతో క్యాడర్లో అయోమయం నెలకొంది.