ఎమ్మెల్యే మేనల్లుడి వివాదాస్పద ఫేస్ బుక్ పోస్ట్.. అల్లర్లలో ముగ్గురు మృతి

ఎమ్మెల్యే మేనల్లుడి వివాదాస్పద ఫేస్ బుక్ పోస్ట్.. అల్లర్లలో ముగ్గురు మృతి

ఒక ఫేస్ బుక్ పోస్టు వల్ల అల్లర్లు చెలరేగి ముగ్గురు మృతి చెందగా.. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. డీజీ హళ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ఓ వర్గాన్ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. దాంతో ఆ వర్గానికి చెందిన కొంతమంది ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు విసురుతూ దాడి చేశారు. అంతేకాకుండా.. ఆయన ఇంటి వద్ద ఉన్న వాహనాలను ద్వంసం చేసి నిప్పంటించారు. దాంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేస్తూ.. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అయితే పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. దాంతో కోపోద్రిక్తులైన ఆందోళనకారులు.. స్థానిక పోలీస్ స్టేషన్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. స్టేషన్ ఆవరణలో ఉన్న 24 కార్లు, 200 బైకులకు నిప్పంటించారు. ఈ దాడులను కవర్ చేయడానకి వెళ్లిన ఒక రిపోర్టర్ కూడా గాయపడ్డాడు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చామని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. హింసాకాండకు గురైన డిజి హళ్లీ, కేజి హళ్లీ ప్రాంతాలలో రేపు ఉదయం వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడులకు కారణమైన ఫేస్ బుక్ పోస్టు పెట్టిన నవీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా దాడికి పాల్పడిన 110 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప ఈ దాడిని ఖండించారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి కూడా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేస్తూ వీడియోను విడుదల చేశారు. ప్రజలు తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోకూడదని ఆయన సూచించారు. ఘటన జరిగిన ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను పంపుతూ.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఇలాంటి గొడవలే జరుగుతాయని హెచ్చరించారు. సోషల్ మీడియా ఉపయోగిస్తున్న వారందరూ జాగ్రత్తగా ఉండాలని.. తప్పుడు వార్తలు ప్రచారం చేసి యాంటీ సోషల్ గా మారొద్దని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

అమెరికా ఉపరాష్ట్రపతి రేసులో తెలుగు మహిళ

నిండు చూలాలికి పురుడు పోసిన స్థానిక ఎమ్మెల్యే

రాష్ట్రంలో కొత్తగా 1897 కరోనా కేసులు

టాప్ టెన్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ విడుదల.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు..