గ్రాండ్‌గా మొదలైన 'విప్లవ వీరుడు' షూటింగ్.. రాణి భవానిదేవిగా ఇంద్రజ

గ్రాండ్‌గా మొదలైన 'విప్లవ వీరుడు' షూటింగ్.. రాణి భవానిదేవిగా ఇంద్రజ

Viplava Veerudu: బ్రిటిష్ పాలనపై ఎదిరించి నిలబడిన సామాన్యుల పోరాట పటిమను కళ్లకు కట్టేందుకు ‘విప్లవ వీరుడు’ సిద్ధమవుతున్నాడు. భారత స్వాతంత్ర సంగ్రామ నేపథ్యంలో.. సామాన్యులే వీరులై పోరాడిన చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభమైంది. ఏవీ జేఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. నాగరాజ్ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

బ్రిటిష్ వారు వ్యాపారం ముసుగులో మన దేశంలోకి అడుగుపెట్టి, ఇక్కడి సంపదను ఎలా దోచుకున్నారనే యదార్థ పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ముఖ్యంగా టిప్పు సుల్తాన్ కాలం నాటి సామాజిక, రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ, ఆ అరాచకాలను ఎదురించడానికి ఒక సామాన్య పౌరుడు విప్లవ వీరుడిగా ఎలా రూపాంతరం చెందాడన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. అర్థవంతమైన సందేశంతో పాటు, దేశభక్తిని రగిలించే సన్నివేశాలతో స్టోరీని మలిచారు.

ప్రముఖ నటి ఇంద్రజ ఈ సినిమాలో ‘రాణి భవానిదేవి’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర కాలం నాటి కథలు చాలా అరుదుగా వస్తాయని, సామాన్య ప్రజలు కూడా ఈ ఉద్యమంలో ఎంతటి వీరోచితంగా పోరాడారో ఈ సినిమా ద్వారా నేటి తరానికి తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవడంలో రాణి భవానిదేవి పాత్ర ఎంతో ధైర్య సాహసాలతో కూడి ఉంటుందని ఆమె వివరించారు.

హీరో జైశ్వర్ మాట్లాడుతూ.. ‘విప్లవ వీరుడు’ పాత్ర తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదని, ఇది సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. హీరోయిన్ సోనాలి శెట్టికి ఇది మొదటి సినిమా కావడం విశేషం. దర్శకుడు నాగరాజ్ రావు ఈ చిత్రాన్ని తన ‘డ్రీమ్ ప్రాజెక్ట్’గా అభివర్ణిస్తూ.. బ్రిటీష్ కాలం నాటి సహజత్వాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

మన దేశం స్వేచ్ఛగా ఉండటానికి కారణమైన మహనీయుల త్యాగాలను తెరపైకి తీసుకురావడం అభినందనీయమని నటుడు పటేల్ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. జైశ్వర్, సోనాలి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కిషోర్, రాగిణి ప్రజ్వల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక విభాగంలో మాత్యు రాజన్ సినిమాటోగ్రఫీ, ఉదయ్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఒక సామాన్యుడి పోరాటం ఏ స్థాయికి చేరిందనేది తెలియాలంటే ‘విప్లవ వీరుడు’ వెండితెరపైకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.