అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ఒక లీకైన ఆడియో క్లిప్ సంచలనం సృష్టిస్తోంది. భారత దేశంతో జరగాల్సిన కీలకమైన ట్రేడ్ డీల్ కి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ఉన్నతాధికారులు ఎలా అడ్డుకున్నారో అమెరికా సీనియర్ సెనేటర్ టెడ్ క్రూజ్ ఈ ఆడియోలో బయటపెట్టారు. అమెరికా ప్రపంచ దేశాలపై విధించిన ట్రేడ్ టారిఫ్స్ చుట్టూ జరుగుతున్న ఈ గొడవ ఇప్పుడు భారత్-అమెరికా సంబంధాల్లో చర్చనీయాంశంగా మారింది.
లీకైన ఆడియోలో ఏముంది..?
రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ టెడ్ క్రూజ్ తన ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడిన 10 నిమిషాల ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో ఆయన ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి పన్నుల విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవారో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాన కారణమని ఆరోపించారు. వీరు భారత్‌తో స్నేహపూర్వక ఒప్పందాల కంటే కఠినమైన ఆంక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
ఈ ఆడియోలో క్రూజ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. 2025 ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాలపై భారీగా టారిఫ్స్ విధించినప్పుడు.. టెడ్ క్రూజ్, మరికొందరు సెనేటర్లు అర్థరాత్రి ట్రంప్‌కు ఫోన్ చేసి దీనిని వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో నిత్యావసర ధరలు 20 శాతం వరకు పెరుగుతాయని, ఇది రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ లాంటిదని వారు ట్రంప్ ని హెచ్చరించారు. అయితే దీనికి ట్రంప్ ఏమాత్రం తగ్గకుండా సెనేటర్లపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని క్రూజ్ వివరించారు.
భారత్‌తో ఒప్పందానికి అడ్డంకులు..
భారత్‌తో ట్రేడ్ డీల్ కోసం తాను వైట్ హౌస్‌తో పోరాడుతున్నానని.. కానీ జేడీ వాన్స్ వంటి వారు దీనిని ముందుకు సాగనివ్వడం లేదని క్రూజ్ పేర్కొన్నారు. అమెరికా విధించిన 50 శాతం దిగుమతి సుంకాల వల్ల భారతీయ ఎగుమతులు దెబ్బతింటున్నాయని, దీనివల్ల అమెరికా వినియోగదారులకే నష్టమని వాదించారు. పీటర్ నవారో, జేడీ వాన్స్, ఒక్కోసారి స్వయంగా ట్రంప్ కూడా ఈ ఒప్పందాన్ని పెండింగ్‌లో పెడుతున్నారని ఫోన్‌కాల్‌లో వివరించారు.
ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే 2026 నాటికి అమెరికన్ల సేవింగ్స్ తగ్గిపోయి, ధరలు ఆకాశాన్ని తాకుతాయని క్రూజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చివరకు ట్రంప్ అభిశంసనకు కూడా దారితీయవచ్చని ఆయన హెచ్చరించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ అమెరికాలోనే కాకుండా భారత దౌత్య వర్గాల్లోనూ పెద్ద దుమారాన్నే రేపుతోంది. తెరవెనుక అమెరికా ఆడుతున్న ఆటలు, పైకి చేస్తున్న నటనకు ఉన్న తేడా స్పష్టంగా తాజా ఆడియో లీక్ ద్వారా తేలిపోయింది. కావాలనే ఇండియాపై అధిక సుంకాలు వేసి వాటిని తొలగించకుండా అమెరికా నేతలు కాలయాపన చేస్తున్నారని క్రూజ్ మాటల చెప్పకనే చెబుతున్నాయి.
