- చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాల్లో జనం బెంబేలు
చొప్పదండి, వెలుగు: చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాల్లో పెద్దపులి అడుగులు కనిపించడంతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా పెద్దపులి ఉందని ప్రకటించడంతో ‘ఇదిగో పులి.. అదిగో పులి’ అన్నట్లుగా ఇతర ప్రాంతాల్లోని పులుల ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బుధవారం చొప్పదండి మండలం రుక్మాపూర్, కాట్నపల్లి మధ్య కారులో వెళ్లే వారు ఫోన్‌లో తీసిందంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరలయింది.
మళ్లీ గురువారం కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం రోడ్డు దాటుతుందని మరో ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదేగాక చొప్పదండి, కరీంనగర్ హైవే రోడ్డులో రుక్మాపూర్ శివారులో పెద్దపులి రోడ్డు దాటిందని మరొకదానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈక్రమంలో రెండు మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఫొటోలు వట్టి వదంతులేనని ఫారెస్ట్ ఆఫీసర్లు అంటున్నారు.
