వర్షాలతో జనం విలవిల.. అధికారుల మందు పార్టీ

వర్షాలతో జనం విలవిల.. అధికారుల  మందు పార్టీ
  • గోదావరి సహాయక చర్యలను గాలికొదిలేసిన అధికారులు
  • భద్రాచలం ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనంలో జల్సా  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భారీ వర్షాలతో జనం అతలాకుతలం అవుతుంటే.. సహాయక చర్యలు చేపట్టాల్సిన కొందరు అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి మందు పార్టీలో మునిగి తేలారు. భద్రాచలం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ వేదికగా వారు విందు చేసుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంలా నిలిచింది. ఒకవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉరకలెత్తుతూ భయాందోళనకు గురిచేస్తుంటే.. జనానికి అందుబాటులో ఉండాల్సిన అధికారులు జల్సా చేసుకున్నారు.  పలువురు కాంట్రాక్టర్లతో కలిసి భద్రాచలం ఆర్ అండ్ బీ కార్యాలయ భవనంలో కూర్చొని మద్యం తాగారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోపై ప్రజా సంఘాలు  తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ విందులో పాల్గొన్న ఆర్ అండ్ బీ డీఈ వెంకటేశ్వరరావు తో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ముంపు బాధిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిబ్బంది సరిపోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేసి మంత్రులు, ప్రజా ప్రతినిధులతోపాటు ఉన్నత అధికారులు 24 గంటలు విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనేక చోట్ల సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలైంది.