అది బార్ కాదురా అయ్యా : క్లాసుకు తాగొచ్చిన టీచర్.. పాఠాలు గాలికొదిలేసి మత్తు నిద్ర

అది బార్ కాదురా అయ్యా : క్లాసుకు తాగొచ్చిన టీచర్.. పాఠాలు గాలికొదిలేసి మత్తు నిద్ర

అతనో టీచర్.. రేపటి పౌరులను తయారు చేసే ఉపాధ్యాయుడు.. మత్తు వల్ల జీవితాలు ఎలా చిత్తు అవుతాయి అని పిల్లలకు చెప్పాల్సిన మాస్టారు.. ఫుల్ గా మందు కొట్టి.. గ్లాసులకు గ్లాసులు లిక్కర్ తాగి.. ఎంచక్కా క్లాసుకు వచ్చాడు.. అది పట్టపగలు.. టిఫిన్ తోపాటు మందు కొట్టినట్లు ఉన్నాడు.. ఏకంగా స్కూలుకు వచ్చాడు. ఏ మాత్రం భయం లేకుండా చక్కగా క్లాసు గదిలోకి వెళ్లి.. కుర్చీలో కూర్చుని మత్తు నిద్రలోని జారుకున్నాడు.. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులు.. మత్తులో విహరిస్తుంటే.. పిల్లలు మాత్రం అల్లరి చేస్తూ గంతులేశారు.. అయినా సరే ఏ మాత్రం సోయిలో లేకుండా కుర్చీలోనే మత్తు నిద్రలో విహరించాడు.. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉత్తర్ ప్రదేశ్ లోని హమీమ్ పూర్ జిల్లాలో.. మద్యం మత్తులో పాఠశాలకు చేరుకున్న ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. తరగతి గదిలోని కుర్చీపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఉపాధ్యాయుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీచర్ తాగిన స్థితి గురించి సమాచారం అందుకున్న స్థానిక నివాసితులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ఉపాధ్యాయుడు అప్పటికే బాగి తాగి ఉండడంతో .. కుర్చీలో నుండి లేవలేకపోయాడు.

Also Read :- ఏనాడు కూడా రైతుబంధు,దళితబంధు ఆపమని చెప్పలే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ సమయంలో టీచర్ పరిస్థితిని చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఉపాధ్యాయుడు అపస్మారక స్థితి నుంచి మేల్కొన్న తర్వాతే స్థానికులు అక్కడ్నుంచి వెళ్లిపోతున్నట్లు వీడియోలో చూడవచ్చు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీచర్ మద్యం మత్తులో పాఠశాలకు రావడం ఇదేం మొదటిసారి కాదు. పాఠశాలల్లో ఇటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు, విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారు ఎలా అభివృద్ధి చెందుతారు అని పలువురు ఈ సంఘటనతో ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి టీచర్లు అమాయక పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

టీచర్ సస్పెండ్

ఈ విషయంలో అధికారులు అనేక హెచ్చరికలు చేసినప్పటికీ, టీచర్ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తాజా ఘటనపై స్పందించిన జిల్లా ప్రాథమిక విద్యా అధికారి అలోక్ సింగ్... "ఈ విషయంపై విచారణ చేస్తున్నామని.. ఉపాధ్యాయుడిని దోషిగా గుర్తించి సస్పెండ్ చేశామని వెల్లడించారు.