ఐకియా స్టోర్ నుంచి తప్పించుకొని పారిపోయిన కస్టమర్స్

ఐకియా స్టోర్ నుంచి తప్పించుకొని పారిపోయిన కస్టమర్స్

చైనాలో ఐకియా స్టోర్ కి వచ్చిన కస్టమర్లను బంధించడానికి అక్కడి సిబ్బంది యత్నించారు. చివరికి ఎలాగోలా తప్పించుకొని వారు అక్కడ్నుంచి పారిపోయారు. ఈ ఘటన చైనాలోని షాంఘైలో జరిగింది. ఇటీవల ఐకియా స్టోర్ కి వచ్చిన ఓ వ్యక్తి కరోనా సోకినట్టు సమాచారం. దీంతో వెంటనే అలర్ట్ అయిన స్టాఫ్...ఆ స్టోర్ లో ఉన్నవారందర్నీ ఐసోలేషన్ లో ఉంచాలని ప్రయత్నించారు. అందులో భాగంగా ఐకియా స్టోర్ ద్వారాలు మూసివేశారు. విషయం గమనించిన కస్టమర్లు అక్కడ్నుంచి వెళ్లేందుకు పరుగులు తీశారు. అక్కడి స్టాఫ్ వారిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ... చివరికి మాత్రం వారు ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు.

కరోనా పుట్టినల్లుగా చెప్పుకునే చైనాలో కొవిడ్ విజృంభణం ఇంకా కొనసాగుతోంది. కరోనాను ఎదుర్కొనేందుకు జీరో కొవిడ్ విధానాన్ని అవలంబిస్తున్నామని అక్కడి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. కాగా అత్యధిక జనాభా ఉన్న షాంఘైలో కొవిడ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండడంతో చైనా కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఐకియా స్టోర్ కి వచ్చి వెళ్లిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని తేలడంతో  స్టోర్ సిబ్బంది ఈ విధమైన చర్యలు చేపట్టింది.