- వీడియో వైరల్.. కేసు నమోదు
మెహిదీపట్నం, వెలుగు: పెండ్లి బారాత్లో బొమ్మ తుపాకీతో హల్చల్ చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఉద్దీన్ పెండ్లి బారాత్లో ఈ నెల 12న తన ఫ్రెండ్స్ అల్తాఫ్తో పాటు పలువురు బొమ్మ తుపాకీ పట్టుకొని డ్యాన్స్‌లు చేస్తూ హల్చల్ చేశారు. పెండ్లికి వచ్చిన బంధువులు దీనిని నిజమైన తుపాకీ అనుకొని భయపడ్డారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకొని విచారించగా, బొమ్మ తుపాకీ అని తేలింది. అయినప్పటికీ ప్రజల్లో భయాందోళనలు కలిగించినందుకు కేసు నమోదు చేశామని సీఐ వెంకట రాములు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
