
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికులు, ఉద్యో గులకు తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్న క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ( సీసీఎస్ ) ని కాపాడాలంటూ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ( ఎస్ డబ్ల్యూ ఎఫ్ ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావులు కోరారు. ప్రతి నెల కార్మికుల జీతాల్లోంచి కట్ చేస్తున్న రూ.16 కోట్లు సీసీఎస్ కు ఆర్టీసీ చెల్లించేలా ఆదేశించాలన్నారు. శుక్రవారం ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కు నేతలు లేఖ రాశారు.
కార్మికుల నుంచి ఆర్టీసీ నెలవారీగా కట్ చేస్తున్న అమౌంట్ 2021 ఫిబ్రవరి నుంచి 2023 నవంబరు వరకు సీసీఎస్ కు సక్రమంగా జమ చేయలేదని... అసలు 680 కోట్లు, దానిపై వడ్డీ 442 కోట్లు కలిపి 1122 కోట్లు ఆర్టీసీ తన అవసరాల కోసం ఉపయోగించుకున్నదని నేతలు తెలిపారు. దీంతో సీసీఎస్ ఆర్థిక ఇబ్బందుల్లో పడి దివాలా స్థితికి చేరుకుందని చెప్పారు. సీసీఎస్ లో గతంలో 60 వేల మంది సభ్యులు ఉంటే ప్రస్తుతం 39 వేలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.