Wimbledon 2025: జొకోవిచ్ మ్యాచ్‌కు హాజరైన కోహ్లీ.. టెన్నిస్ దిగ్గజానికి విరాట్ స్పెషల్ ట్వీట్

Wimbledon 2025: జొకోవిచ్ మ్యాచ్‌కు హాజరైన కోహ్లీ.. టెన్నిస్ దిగ్గజానికి విరాట్ స్పెషల్ ట్వీట్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ తర్వాత తొలిసారి స్టేడియంలో తళుక్కుమన్నాడు.  అయితే కోహ్లీ కనిపించింది క్రికెట్ స్టేడియంలో కాకుండా టెన్నిస్ మ్యాచ్ చూస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. సోమవారం (జూలై 7) 24 గ్రాండ్ స్లామ్స్ వీరుడు నోవాక్ జొకోవిచ్ వింబుల్డన్ మ్యాచ్ చూడడానికి విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మతో కలిసి హాజరయ్యారు. సెంటర్ కోర్ట్ రౌండ్ ఆఫ్ 16లో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో డి మినౌర్‌పై 1-6, 6-4, 6-4, 6-4 తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు. 

తొలి టెస్ట్ ఓడిపోయిన తర్వాత జొకోవిచ్ వరుసగా మూడు సెట్ లు గెలవడం విశేషం. నాలుగో సెట్ లో 1-4 తో వెనకబడి ఉన్నప్పటికీ వరుసగా 5 గేమ్ లు గెలిచి సెట్ తో మ్యాచ్ ను గెలిచాడు. ఈ విజయంతో ఈ సెర్బియా వీరుడు వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్ లో తబిలోతో జొకోవిచ్ తలపడాల్సి ఉంది.  ఈ మ్యాచ్ లో వెనకపడినప్పటికీ జొకోవిచ్ పుంజుకున్న తీరు కోహ్లీకి బాగా నచ్చింది. దీంతో మ్యాచ్ తర్వాత జొకోవిచ్ ను కోహ్లీ ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు.  అద్భుతమైన మ్యాచ్.. ఇలాంటి మ్యాచ్ లు జొకోవిచ్ కే సాధ్యమంటూ కోహ్లీ తన ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేసాడు.

కోహ్లీ ట్వీట్ కి జొకోవిచ్ స్పందించాడు. "నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యావాదాలు" అని చెప్పాడు. కోహ్లీ, జొకోవిచ్ ఇప్పటివరకు కలవకపోయినా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జొకోవిచ్ గొప్ప లెజెండ్ అంటూ మెసేజ్ చేశాడు. టెస్ట్, టీ20 ఫార్మాట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో జరగనున్న వన్డే సిరీస్ వాయిదా పడడంతో కోహ్లీ టీమిండియా తరపున అక్టోబర్ 19 న ఆడనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు ఆడనుంది.