
ఓవైపు కరీబియన్ టూర్‌కు ఘనమైన ముగింపు..! మరోవైపు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు అత్యద్భుతమైన ఆరంభం..! మధ్యలో ఇండియా రథ సారథి విరాట్ విజయాల రికార్డు..! మునుపెన్నడూ లేనంత బలంగా ముందుండి టీమ్‌ను నడిపించిన విరాట్ కోహ్లీ.. విండీస్ గడ్డపై వరుసగా మూడు సిరీస్‌లను కొల్లగొట్టిన గెలుపు సారథి అయ్యాడు..! సాధారణ ఆటగాడిగానే వచ్చినా.. సంప్రదాయమైన ఆటకు రారాజుగా మారుతూ.. ఇప్పుడు కెప్టెన్‌గా టీమిండియాకు విజయాల (28) రాజుగా మారిపోయాడు..! మొన్న బుమ్రా, నిన్న షమీ, జడేజా.. అమ్మో అనిపించడంతో.. రెండో టెస్ట్‌లోనూ విండీస్ వీరులకు ఓటమి తప్పలేదు..! సిరీస్ 2–0తో విరాట్‌సేన సొంతం కాకుండా ఆగలేదు..!!
కింగ్‌స్టన్:వెస్టిండీస్ ఇలాకాలో ఇండియా టీమ్.. వరుసగా మూడో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌తో మొదలైన జైత్రయాత్రను.. వన్డే, టెస్ట్‌ల్లోనూ కొనసాగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ బౌలింగ్ పెర్ఫామెన్స్‌ను చూపెట్టిన విరాట్‌సేన.. నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లోనూ 257 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు 120 పాయింట్లు లభించాయి. ఇండియా నిర్దేశించిన 468 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 210 రన్స్‌కే ఆలౌటైంది. బ్రూక్స్ (50) టాప్ స్కోరర్. విహారికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో విండీస్ కనీసం ఒక్క ఇన్నింగ్స్‌లోనూ 250 రన్స్ కూడా దాటలేదు. టపటపా..
తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓ మాదిరిగానే ఆడింది. బ్రాత్‌వైట్ (3), క్యాంప్‌బెల్ (16) వైఫల్యంతో మూడో రోజు ఆట ముగించిన విండీస్.. నాలుగో రోజు కాసేపు పోరాడింది. 45/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బ్రూక్స్ నిలకడగా ఆడినా.. బ్రావో (23) రిటైర్డ్‌హార్ట్ కావడం విండీస్‌ను దెబ్బతీసింది. ఇతను బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం లేకపోవడంతో ‘కాంకషన్’గా బ్లాక్‌వుడ్‌ను ఆడించారు. పేసర్లకు దీటుగా జడేజా కూడా బంతితో మ్యాజిక్ చేశాడు. దీంతో ఛేజ్ (12), హెట్‌మయర్ (1) పూర్తిగా విఫలమయ్యారు. మెల్లగా ఆడుతూ 29వ ఓవర్‌లో 100 పరుగులకు చేరిన హోల్డర్ బృందం 145/4తో లంచ్‌కు వెళ్లింది. కానీ విరామం తర్వాత షమీ (3/65) స్వింగ్‌తో, జడేజా (3/58) టర్నింగ్‌తో కరీబియన్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు.
దీంతో లంచ్ తర్వాత తొలి గంటలో విండీస్ 65 పరుగులు జోడించి ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. బ్రూక్స్, బ్లాక్‌వుడ్ (38) ఐదో వికెట్‌కు 61 పరుగులు జత చేసి కాస్త ప్రతిఘటించారు. కానీ బుమ్రా (1/31) దెబ్బకు బ్లాక్‌వుడ్ ఔట్‌కాగా, 54వ ఓవర్‌లో బ్రూక్స్‌ను కోహ్లీ సూపర్ రనౌట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బ్రూక్స్ బంతిని పాయింట్ వైపు ఫుష్ చేసి రన్ కోసం ప్రయత్నించగా, కవర్స్ నుంచి వేగంగా పరుగెత్తుకొచ్చిన కోహ్లీ అంతే స్పీడ్‌తో బంతిని అందుకుని డైరెక్ట్ త్రోతో టార్గెట్‌ను పూర్తి చేశాడు. మిగతా ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఇండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
మళ్లీ మెరిసిన విహారి
అంతకుముందు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 54.4 ఓవర్లలో 168/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తెలుగు కుర్రాడు విహారి (53 నాటౌట్), రహానె (64 నాటౌట్) మరోసారి మెరిశారు. 57 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన ఇండియా ఇన్నింగ్స్‌ను ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించి ఆదుకున్నారు. రాహుల్ (6), మయాంక్ (4), పుజారా (27), కోహ్లీ (0) నిరాశపర్చారు. రోచ్‌కు 3 వికెట్లు దక్కాయి.