
విరాట్ కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ తొలి ఎడిషన్ నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తరపున ఆడుతూ వస్తున్న కోహ్లీ.. జట్టును ఒంటి చేత్తో నడిపించాడు. కెప్టెన్ గా.. ప్లేయర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్సీబీ అంటే కోహ్లీ అనేలా మారిపోయిందంటే విరాట్ ఆ జట్టుకు చేసిన కృషి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. 17 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ రాకపైనా 18 వ ప్రయత్నంలో ఆర్సీబీకి టైటిల్ అందించి కరువు తీర్చాడు. ఎన్నో ఆర్సీబీ జట్టుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్న కోహ్లీ త్వరలోనే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీతో మాట్లాడినట్టు సమాచారం. 2026 ఐపీఎల్ లో ఆడేందుకు కోహ్లీ కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదట. దీంతో కోహ్లీ ఐపీఎల్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయం విరాట్ ఫ్యాన్స్ కు కలవరానికి గురి చేస్తోంది. 18 ఏళ్ళ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో కోహ్లీ ఇకపై ఈ మెగా లీగ్ లో కొనసాగేందుకు ఆసక్తి చూపించకపోవచ్చు. కోహ్లీ ఇన్నేళ్లు ఆర్సీబీ టైటిల్ అందించాలనే కసి మీద ఆడాడు. టైటిల్ గెలవడంతో తాను సాధించాల్సింది ఏమీ లేదని భావించి ఉంటాడనే టాక్ కూడా వినిపిస్తుంది.
ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయక్రికెట్ లో కేవలం ఒకే ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. గత ఏడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన కోహ్లీ.. ఈ ఏడాది ప్రారంభంలో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని ప్రపంచ క్రికెట్ ను షాక్ కు గురి చేశాడు. తాజాగా ఐపీఎల్ కు రిటైర్మెంట్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ లో 8 వేలకు పైగా పరుగులు చేసిన కోహ్లీ.. ఈ మెగా లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్ కూడా కోహ్లీని కావడం విశేషం. 2016 ఐపీఎల్ లో ఏకంగా 973 పరుగులు చేసి ఒకే సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
చివరిసారిగా ఐపీఎల్ లో కనిపించిన కోహ్లీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ బ్యాట్ పట్టబోతున్నాడు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం లండన్ లో ఉన్న కోహ్లీ త్వరలోనే తన సొంత నగరాం ఢిల్లీకి రానున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 15 నుంచి ఆస్ట్రేలియా బయలుదేరనున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ దాదాపు 8 నెలల తర్వాత భారత జట్టులో కనిపించనున్నాడు.