టీమిండియాలో అత్యంత ఫిట్ గా ఉండే ప్లేయర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) వైద్య సేవలను వినియోగించుకోని ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ విషయం బట్టి కోహ్లీ ఏ రకమైన డైట్, ఫిట్ నెస్ మెయింటెనెన్స్ చేస్తాడో అర్థమవుతుంది. కోహ్లీ ఒక పరుగుల యంత్రమే కాదు, ఫిట్‌నెస్ ఫ్రీక్ అని కూడా మనందరికి తెలుసు. 37 ఏళ్ల వయసులోనూ యువ క్రికెటర్లకు సవాల్ విసిరే శరీర ధారుడ్యం, మెరుపు వేగం అతనిది. అయితే, ఆ ఫిట్‌నెస్ నిలకడగా మెయిన్టేన్ చేయడం అంత సులువైన పని కాదు. కానీ, విరాట్ మెయిన్టేన్ చేస్తున్నాడు.
ఫిట్‌గా ఉండేందుకు కోహ్లీ అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఫిట్‌నెస్, ఆహారం విషయంలో క్రమశిక్షణతో ఉంటారు. రోజూ ఉదయం లేవగానే కార్డియో వర్కవుట్స్, క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. అసలు ఈ స్టార్ క్రికెటర్ ఏం తింటాడు? అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. ఆ రహస్యాలను తాజాగా కోహ్లీ బయట పెట్టాడు. ఈ రోజు (నవంబర్ 5) తన పుట్టిన రోజు సందర్భంగా తన డైట్ సీక్రెట్స్ ను రివీల్ చేశాడు.
కోహ్లీ తన ఫిట్ నెస్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "మీరు జిమ్‌లో ఎన్ని గంటలు గడుపుతున్నారో దానికంటే తినే ఆహరం చాలా ముఖ్యమని చెప్పారు. ఫిట్‌నెస్ విషయంలో నేను ఎదుర్కొన్న ఛాలెంజ్ ఆహారం. నేను ఆరు నెలలుగా రోజుకు మూడు సార్లు ఒకే రకమైన భోజనం తినగలను. నా ఆహారంలో దాదాపు 90% ఆవిరి మీద ఉడికించినవి ఉంటాయి. నేను రుచి కోసం ఆరాటపడే వ్యక్తిని కాను.
నా శరీరానికి ఏది సరైనదో దానిపై దృష్టి పెడతాను. నేను కొద్దిగా డ్రెస్సింగ్‌తో సలాడ్‌లు, ఆలివ్ నూనెతో పాన్-గ్రిల్డ్ వంటకాలను ఆస్వాదిస్తాను. నేను కూరలకు దూరంగా ఉంటాను. కానీ పప్పు తింటాను వాటితో పాటు రాజ్మా, లోభియాను నా డైట్ లో ఉంటాయి". అని విరాట్ స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
2018 లో విరాట్ కోహ్లీకి అసిడిటీ.. అధిక యూరిక్ యాసిడ్ భారిన పడ్డాడు. అతని ఎముకలలో కాల్షియం స్థాయిలు తక్కువగా ఉన్నాయని, ఇది అతనికి అసౌకర్యంగా ఉందని వైద్యులు కూడా చెప్పారు. అప్పుడే కోహ్లీ తన జీవనశైలిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మాంసం తినడం మానేసి పూర్తిగా శాఖాహారిగా మారాడు. అప్పటి నుండి కోహ్లీ వేయించిన ఆహారాలు, కూరలు, కారంగా ఉండే వంటకాలకు దూరంగా ఉన్నాడు. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన భోజనాన్ని తింటాడు. కర్లీ టేల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ తాను పూర్తిగా శాకాహారి కాదని.. తాను ఇప్పటికీ కొన్ని పాల ఉత్పత్తులను తింటున్నానని చెప్పుకొచ్చాడు.
