RR vs RCB: రోనాల్డో,మెస్సీని చూసి నేర్చుకో.. కోహ్లీ RCBను వదిలేయాలంటూ పీటర్సన్ సలహా

RR vs RCB: రోనాల్డో,మెస్సీని చూసి నేర్చుకో.. కోహ్లీ RCBను వదిలేయాలంటూ పీటర్సన్ సలహా

ఒకే జట్టు తరపున 17 సీజన్ లు.. మూడు సార్లు ఫైనల్ కు వెళ్ళినా దక్కని ట్రోఫీ.. ఫ్యాన్స్, ఫ్రాంచైజీ కోసం ఒకే జట్టులో కొనసాగడం.. ప్రతి సారి వ్యక్తిగతంగా పోరాడినా టైటిల్ అందుకోలేకపోవడం.. ఇది ఐపీఎల్ లో కోహ్లీ కథ. 2008 నుంచి బెంగళూరు జట్టుకే పరిమితమైన కోహ్లీ.. 17 సీజన్ లు గడిచినా అదే టీంతో ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా కోహ్లీ జట్టు ట్రోఫీ గెలవలేకపోవడంతో అతనితో పాటు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఐపీఎల్ లో భాగంగా బుధవారం (మే 22) రాజస్థాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఎప్పటిలాగే కోహ్లీకి హార్ట్ బ్రేక్ తప్పలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కొహ్లీకి ఒక కీలక సలహా ఇచ్చాడు. అతను ఆర్సీబీ జట్టును వదిలేయాలని సూచించాడు. ఆర్సీబీ ఓటమి అనంతరం స్టార్ స్పోర్ట్స్ తో పీటర్సన్ ఫుట్ దిగ్గజాలు మెస్సి, రోనాల్డో లను ఉదాహరణలుగా చూపిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

"కోహ్లీ కారణంగా ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది. అతను ఇన్నేళ్లు ఆర్సీబి జట్టుకు ఎందుకు ఆడుతున్నాడో నేను అర్ధం చేసుకోగలను. అయితే విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి అర్హుడు. అతను టైటిల్ గెలవాలంటే ఆర్సీబీ జట్టును వీడాలి. ట్రోఫీలు గెలవడానికి ఫుట్ బాల్ స్టార్ ఆటగాళ్ళు తమ క్లబ్‌లను వదిలేశారు. బెక్‌హామ్,రొనాల్డో,మెస్సీ తమ క్లబ్ లను వదిలేసిన తర్వాత వారు టైటిల్ గెలుచుకున్నారు. తాజాగా హ్యారీ కేన్ వేరే క్లబ్ ఆడడానికి వెళ్ళిపోయాడు. కోహ్లీ కూడా ఇలాగే చేయాలి. అతను తన సొంత జట్టు ఢిల్లీకి ఆడాలి". అని పీటర్సన్ అన్నారు.

ఈ టోర్నీలో 741 పరుగులు చేసిన కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఉన్న ఆటళ్లలో పరాగ్ (567) మాత్రమే కోహ్లీ కంటే వెనకున్నాడు. వీరిద్దరి మధ్య 174 పరుగులు వ్యత్యాసం ఉండడంతో ఈ సీజన్ లో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకోవడం దాదాపుగా ఖాయమైంది. ఐపీఎల్ లో మొత్తం 8004 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.