న్యూఢిల్లీ: ఆప్ఘానిస్తాన్తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కండరాల గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 19లో పరుగుల వరద పారించిన కోహ్లీని బ్లూ జెర్సీలో చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది.
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. 2026, జూన్ 13 నుంచి 20 మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా భావిస్తోన్న ఈ కీలకమైన సిరీస్‌కు గాయం కారణంగా కోహ్లీ దూరం కావడం భారత్‌కు ఎదురు దెబ్బే.
ఈ సిరీస్‌కు కోహ్లీ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు. ఈ గాయం కారణంగా 2026, జూలై 14 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ పాల్గొనడంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. ఈ సిరీస్‌లో ఇండియా ఇంగ్లాండ్ మూడు వన్డేలు ఆడనున్నాయి.
2027 వరల్డ్ కప్ టార్గెట్:
ఈ వన్డే సిరీస్ 2027 వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా టీమిండియా భావిస్తోంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో తృటిలో చేజారిన టైటిల్‌ను ఈసారి ఎలాగైనా అందుకోవాలనే కసితో రోహిత్, కోహ్లి ఉన్నారు. తమ కెరీర్ చివరి దశలో ఉండటంతో ఈ ఇద్దరు, తమ ఫిట్నెస్, ఫామ్ కాపాడుకోవడానికి ఈ సిరీస్ కీలకంగా భావిస్తున్నారు. కానీ గాయం కారణంగా కోహ్లీ ఈ కీలకమైన సిరీస్‌కు దూరం కావడం గమనార్హం.
కసి మీదున్న కింగ్ కోహ్లి
విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ గెలవడంలో కోహ్లీ కీ రోల్ పోషించాడు. టోర్నమెంట్లో 675 రన్స్ చేసి ఆర్సీబీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం భారత వన్డే జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్
