ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ

ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ

దుబాయి: ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఆసియా కప్ లో ఇవాళ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో దుమ్ము రేపాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 44 బంతుల్లో 60 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ భారత్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన భారత ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే 53 వరకు ఒక్క వికెట్ కూడా నష్టపోని భారత్... 36 పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ వైపు ఒక్కొక్కరుగా భారత్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పడుతోంటే... కోహ్లీ ఏమాత్రం టెన్షన్ పడకుండా చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచాడు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 181 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. 

విరాట్కు గడ్డు కాలం... 

విరాట్ కెరీర్లో 2022 బ్యాడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో అతను అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఫామ్ లేమితో తంటాలు పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు విరాట్ 4 టీ20లు మాత్రమే ఆడాడు. 20.25 సగటుతో 81 పరుగులే చేశాడు. బెస్ట్ స్కోరు 52. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 16 మ్యాచులు ఆడగా..19 ఇన్నింగ్స్ లలో 25.05 సగటుతో 476 పరుగులు చేశాడు. 79 అత్యుత్తమ స్కోరు.  నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. 2019లో చివరి సెంచరీ సాధించిన తర్వాత కోహ్లీ అన్ని ఫార్మా్ట్లలో 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 82 ఇన్నింగ్స్‌లలో 34.05 సగటుతో 2,554 పరుగులు చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 24 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కానీ ఆసియా కప్ 2022లో పాకిస్థాన్ తో ఇవాళ జరిగిన మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏంటో నిరూపించాడు.