Virat Kohli Birthday: మూడు ఫార్మాట్‌లలో మొనగాడు: నేడు (నవంబర్ 5) కోహ్లీ బర్త్ డే.. క్రికెట్‌లో విరాట్ అసాధారణ రికార్డ్స్ ఇవే!

Virat Kohli Birthday: మూడు ఫార్మాట్‌లలో మొనగాడు: నేడు (నవంబర్ 5) కోహ్లీ బర్త్ డే.. క్రికెట్‌లో విరాట్ అసాధారణ రికార్డ్స్ ఇవే!

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు (నవంబర్ 5). 1988 న‌వంబ‌ర్ 5న ప్రేమ్‌నాథ్ కోహ్లీ, స‌రోజ్ దంపతులకు జన్మించిన విరాట్ బుధవారం 37 ఏళ్లు పూర్తి చేసుకొని.. 38వ వ‌సంతంలో అడుగుపెట్టాడు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకొని దిగ్గజాల సరసన చేరాడు. కింగ్ కోహ్లిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ స్టార్ క్రికెటర్.. ప్రస్తుతం ఒకే ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. ఈ మధ్యకాలంలో అంతగా ఫామ్ లో లేకపోయినా.. క్రికెట్ లో అతడు సాధించిన రికార్డులు అద్బుతమనే చెప్పాలి. బర్త్ డే సందర్భంగా విరాట్ తన కెరీర్లో సాధించిన అనితర సాధ్యమైన రికార్డులేంటో చూద్దాం. 

కౌలాలంపూర్ లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచిన యువ ఆటగాడిగా ఉన్న రోజుల నుంచి 2008లో ఇండియన్ టీమ్ లోకి అడుగుపెట్టినంత వరకు విరాట్.. నిలకడ, కృషి, అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్, డెడికేషన్, అగ్రెస్సివ్, పరుగులు సాధించాలనే తపనకు కేరాఫ్ గా నిలిచాడు. 

టెస్టుల్లో కోహ్లీ రికార్డ్ అద్భుతం: 

*36 ఏండ్ల కోహ్లీ ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్‌‌‌‌లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్‌‌‌‌) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.

*విరాట్ టెస్టు కెరీర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా 2016 నుంచి 2019 మధ్య మాత్రం ఈ ఫార్మాట్లో అతడు అత్యున్నత ఫామ్ లో ఉన్నాడు. ఈ కాలంలో అతడు 43 టెస్టులు, 69 ఇన్నింగ్స్ లో 66.79 సగటుతో 16 సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 4,208 పరుగులు చేశాడు. ఈ కాలంలోనే అతను ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో ఓ కెప్టెన్ చేసిన అత్యధిక డబుల్ సెంచరీల రికార్డు కోహ్లి పేరిటే ఉంది.

*టెస్టుల్లో టీమిండియా విజయవంతమైన కెప్టెన్ విరాట్ కోహ్లినే. అతడు 68 టెస్టుల్లో కెప్టెన్ గా ఉండగా..ఇండియా ఏకంగా 40 మ్యాచ్ లలో  గెలిచింది. 17 ఓడగా.. 11 డ్రా అయ్యాయి. అతని విజయాల శాతం 58కిపైనే కావడం విశేషం.

వన్డేల్లో తిరుగులేని కోహ్లీ: 

*వన్డే ఫార్మాట్ విరాట్ కోహ్లీ కెరీర్ లో బెస్ట్ ఫార్మాట్ గా మిగిలిపోయింది. ఈ ఫార్మాట్లో అతన్ని మించిన ప్లేయర్ మరొకరు లేరని చెప్పొచ్చు. ఇప్పటి వరకూ 305 వన్డేల్లో 57.71 సగటుతో 14255 పరుగులు చేశాడు. వీటిలో 51 సెంచరీలు, 75 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో కోహ్లీ అత్యుత్తమ స్కోరు 183. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

*వన్డేల్లో 50 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ నిలిచాడు. గత ఏడాది వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్లో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

*కింగ్ కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్ లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా 8,000 పరుగులు, 9,000 పరుగులు, 10,000 పరుగులు, 11,000 పరుగులు, 12,000 పరుగులు, 13,000 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

*50 ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైన పరుగుల ఛేజింగ్ లో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన విరాట్ 'ఛేజింగ్ మాస్టర్'గా పేరుగాంచాడు. 102 మ్యాచుల్లో 90.40 సగటుతో 5,786 పరుగులు, 96 ఇన్నింగ్స్ లో 23 సెంచరీలు, 25 అర్ధసెంచరీలు సాధించాడు.

*2017-18 సీజన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు మ్యాచ్ లలో 186.00 సగటుతో 558 పరుగులు చేసి, మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో వన్డే ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతని అత్యుత్తమ స్కోరు 160 నాటౌట్.

*వన్డే ప్రపంచకప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లిదే. గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో విరాట్.. 11 మ్యాచ్ లలో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలున్నాయి.

టీ20ల్లో నిలకడకు మారు పేరుగా కోహ్లీ: 

*టీ20ల విషయానికి వస్తే విరాట్ 125 టీ20లు, 117 ఇన్నింగ్స్ లో 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 122 నాటౌట్. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లి ఫైనల్లో 76 పరుగులు చేశాడు.

*ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ 538 మ్యాచ్ ల్లో 52.78 సగటుతో 27,693 పరుగులు, 82 సెంచరీలు, 144 అర్ధసెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 254 నాటౌట్. మొత్తం క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో.. ఇండియాలో రెండో స్థానంలో నిలిచాడు. సెంచరీల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

*ఐసీసీ ఈవెంట్లలో మూడు 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డులు గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా విరాట్ నిలిచాడు. వ్యక్తిగతంగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ 2011-2020, ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వంటి పలు ఐసీసీ అవార్డులను గెలుచుకున్నాడు. 2016, 2017, 2018 సంవత్సరాల్లో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది వరల్డ్ అవార్డులు అందుకున్నాడు.