Virat Kohli: ఇండియాకు రాకుండా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కోహ్లీకే ఎలా సాధ్యమైంది

Virat Kohli: ఇండియాకు రాకుండా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. కోహ్లీకే ఎలా సాధ్యమైంది

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుత లండన్ లో ఉన్నాడు. తనకెంతో ఇష్టమైన లండన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో సిరీస్ కు కోహ్లీ ఆడతాడా లేదా అనే ఊహాగానాలకు తెరపడింది. విరాట్ తాజాగా ఫిట్ నెస్ టెస్ట్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. కోహ్లీ ఇండియాకు రాకుండా ఎలా ఫిట్ నెస్ టెస్ట్ లో పాసయ్యాడు అనే అనుమానాలు కలగక మానదు. అయితే కోహ్లీ ఇంగ్లాండ్ లో తన ఫిట్ నెస్ టెస్ట్ పూర్తి చేసినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

ఇంగ్లాండ్‌లో విరాట్ ఫిట్‌నెస్ పరీక్షను బీసీసీఐ పర్యవేక్షించింది. ఇంగ్లాండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించడానికి కోహ్లీకి బోర్డు ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీంతో ప్రస్తుత జట్టులో విదేశాల్లో ఫిట్ నెస్ టెస్ట్ క్లియర్ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇటీవలే వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఇతర భారత ఆటగాళ్లందరూ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ టెస్ట్ పూర్తి చేయడానికి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకు చేరుకున్న సంగతి తెలిసిందే. రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి సెప్టెంబర్‌లో ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ చేయించుకుంటారని తెలుస్తోంది.  

ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి క్రికెట్ ఆడలేదు టెస్ట్ క్రికెట్, టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియా తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఆడనుంది. మూడు వన్డేల ఈ సిరీస్ లో కోహ్లీ ఆడడం ఖాయమైంది. ఈ మధ్యలో భారత జట్టు టీ20 ఫార్మాట్ లో జరగబోయే  ఆసియా కప్ తో పాటు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నెల చివర్లో కోహ్లీ ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

36 ఏళ్ళ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్ కు ఇప్పటికే తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.