
టీమిండియాలో అత్యంత ఫిట్ గా ఉండే ప్లేయర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) వైద్య సేవలను వినియోగించుకోని ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ విషయం బట్టి కోహ్లీ ఏ రకమైన డైట్, ఫిట్ నెస్ మెయింటెనెన్స్ చేస్తాడో అర్థమవుతుంది. అయితే, ఓ ఇంటర్వ్యూలో ‘విరాట్.. మీ డైట్, ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి? అని అడిగిన ప్రశ్నకి, కోహ్లీ ఇచ్చిన జవాబు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని విరాట్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
‘అందరిలాగానే నేను కూడా జంక్ ఫుడ్ తినేవాన్ని. ఆ ఇష్టంతో ప్రపంచంలోని జంక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేశా. పాతికేళ్లు దాటాకా ఫిట్ నెస్ పోయింది. ఆటపై పట్టు కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డా. తర్వాత రియలైజ్ అయి డైట్ మొదలుపెట్టా. ఆహారం, ఎక్సర్ సైజ్ విషయంలో బాగా కేర్ తీసుకున్నా. ఆ ఏజ్ లో అదంతా చాలా కామన్. కానీ, ఫిట్ గా ఉండటం కూడా అంతే ముఖ్యం’ అని విరాట్ కోహ్లీ బదులిచ్చాడు.