కరెంట్ బకాయిలపై తేలని పంచాయితీ

కరెంట్ బకాయిలపై తేలని పంచాయితీ

హైదరాబాద్​, వెలుగు: కరెంట్ బకాయిలు, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనపై పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. బుధవారం కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ప్రతినిధుల సబ్ కమిటీ వర్చువల్ మీటింగ్ జరిగింది. మీటింగ్​లో పలు విషయాలపై క్లారిటీ వచ్చినా ముఖ్యమైన కరెంటు బకాయిలు, పైనాన్స్ ​కార్పొరేషన్ విషయంలో ఎటూ తేలలేదు. కరెంట్​ బకాయిలపై ఏపీ ప్రభుత్వం కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలంగాణ తేల్చిచెప్పింది. అలాగే రెండు రాష్ట్రాల విద్యుత్​ సంస్థల మధ్య ఒప్పందం జరగాలని ప్రతిపాదించింది. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.12,111 కోట్లు రావాల్సి ఉందని చెప్పింది. ఏపీ సర్కార్ తీరు వల్లనే తాము ఇతర మార్గాల్లో గతంలో ఎక్కువ ధరకు కరెంట్ కొన్నామని తెలంగాణ ఆఫీసర్లు వివరించారు. ఏపీ మాత్రం తెలంగాణ నుంచే తమకు రూ.3,442 కోట్లు రావాల్సిఉందని పేర్కొంది.

బకాయిలు చెల్లించేందుకు ఏపీ ఒకే

రెండు రాష్ట్రాల మధ్య చెల్లింపులు కావాల్సిన నగదు, ఫిక్స్​డ్ డిపాజిట్లపై ఈ మీటింగ్​లో స్పష్టత వచ్చింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ విషయంలో ఏపీ నుంచి రావాల్సిన రూ.495.21 కోట్లు చెల్లించేందుకు ఏపీ అంగీకరించింది. వీటితో పాటు మొన్నటి వరకు ఉమ్మడి సంస్థలైన రాజ్​భవన్, హైకోర్టు ఇతరత్రా వాటికి సంబంధించిన ఖర్చులు రూ.315.76 కోట్లు ఇస్తామని స్పష్టం చేసింది. బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (బీఓసీడబ్ల్యూడబ్ల్యూ బీ), లేబర్ వెల్ఫేర్ బోర్డ్ ఫండ్ రూ.464.39 కోట్లు, నెట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ రూ.208.24 కోట్ల ఇంకా రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. మిగిలిన వివరాలు పంపాలని కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీకి తెలంగాణకు సూచించినట్లు స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు గురువారం రిలీజ్​ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ భేటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్​ రంజన్, టీఎస్ జెన్​కో ప్రభాకర్​ రావు, కమర్షియల్ టాక్సెస్ కమిషనర్​ నీతూ ప్రసాద్, సివిల్ సప్లయ్స్ కమిషనర్ వి.అనిల్ కుమార్ పాల్గొన్నారు.

చట్టం సవరించాల్సిన అవసరం లేదు

ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఈ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కోర్టులో వేసిన కేసును విత్ డ్రా చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపింది. పన్ను వసూళ్ల విషయంలో జనాభా ప్రాతిపదికన పంచాలని ఏపీ, వసూలైన దాని ప్రకారం పంచాలని తెలంగాణ కోరింది. ఇందుకోసం ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం–2014 సవరణను చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. సవరణ సాధ్యం కాని పక్షంలో కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని భర్తీ చేయొచ్చని ఏపీ ప్రతిపాదించింది. తెలంగాణ వాదనను పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఈ సమస్య రెండు రాష్ట్రాలది కాదని, ఇష్యూను సాల్వ్​ చేసేందుకు ఓకే చెప్పారు. ఏపీ సివిల్ సప్లయ్స్​కు రూ.354.08 కోట్లు చెల్లించేందుకు తెలంగాణ సివిల్ సప్లయ్స్ అంగీకరించింది. ఈ విషయంలో ఏపీ అండర్​ టేకింగ్ ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో సమస్య తీరింది. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ తెలంగాణ సివిల్ సప్లయ్స్ బ్యాంకు ఖాతాకు పంపేందుకు అండర్ టేకింగ్ ఇచ్చింది.