- ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా మన దేశంలోనే ఇరుక్కుపోయి.. వీసా గడువు ముగిసిన ఫారెనర్లు మే 3వరకు మన దేశంలోనే ఉండొచ్చని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వాళ్ల వీసా గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇండియాకు రావాల్సిన దౌత్యవేత్తలు, ఐరాస అధికారులు మినహా మిగతా వారికి మే 3వరకు వీసా జారీని నిలిపేసినట్లు చెప్పింది. ఫిబ్రవరి 1 అర్ధరాత్రి నుంచి మే 3 వరకు గడువు ముగిసిన వారు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఎలాంటి చార్జ్ లేకుండానే గడువు పొడిగిస్తామని అన్నారు. అధికారులతో మాట్లాడిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నామని హోంశాఖ చెప్పింది. అవసరమైన వారికి మే 3 తర్వాత 14 రోజులు ఎక్స్‌టెన్షన్ ఇస్తామని, ఓవర్ స్టే పెనాల్టీ విధించమని అన్నారు. అంతే కాకుండా దౌత్యవేత్తలు, ఐరాస అధికారులు మినహా విదేశీయులకు జారీ చేసిన వీసాలను మే 3 వరకు రద్దు చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఫారెన్ నుంచి వచ్చే వారి వల్ల కరోనా రావడంతో అధికారులు ట్రావెల్ బ్యాన్ విధించారు. ఫ్లైట్లన్నీ నిలిపేశారు. దీంతో చాలా మంది ఫారెనర్స్ ఇండియాలో ఇరుక్కుపోయారు.
