- క్యూ 2 లో రూ. 23.79 కోట్ల నికర లాభం
- రూ. 292.25 కోట్లకు చేరుకున్న రెవెన్యూ
హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్ కు సెప్టెంబర్ తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ. 23.79 కోట్ల నికర లాభం (స్టాండ్ ఎలోన్) వచ్చింది. కిందటేడాది ఇదే క్వార్టర్ లో వచ్చిన రూ. 22.30 కోట్లతో పోలిస్తే కంపెనీ నెట్ ప్రాఫిట్ ఈ క్యూ2 లో 6.6% పెరిగింది. విశాకకు క్యూ2 లో రూ.292.25 కోట్ల రెవెన్యూ వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్ తో పోలిస్తే కంపెనీ రెవెన్యూ 29% ఎగిసింది. విశాక ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల రిజల్ట్స్‌నూ ప్రకటించింది. కంపెనీకి 2021-–22 ఆర్ధిక సంవత్సరం మొదటి 6 నెలల్లో రూ. 641.32 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంతకు ముందటి ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన రెవెన్యూ తో పోలిస్తే ఈ సారి కంపెనీ రెవెన్యూ 25 % పెరిగింది. నెట్ ప్రాఫిట్ రూ. 56.72 కోట్ల నుంచి రూ. 64.37 కోట్లకు పెరిగింది.
రిజల్ట్స్ హై లైట్స్..
సిమెంట్ రూఫింగ్ షీట్స్, వీ నెక్స్ట్, ఫైబర్ సిమెంట్ బోర్డ్స్ బిజినెస్‌లు కలిసున్న బిల్డింగ్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ సెప్టెంబర్ క్వార్టర్ లో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. క్యూ2 లో ఈ సెగ్మెంట్ నుంచి విశాకాకి రూ. 241.11 కోట్ల రెవెన్యూ వచ్చింది. కిందటేడాది ఇదే క్వార్టర్ లో ఈ సెగ్మెంట్ నుంచి రూ. 202 కోట్ల రెవెన్యూను కంపెనీ ప్రకటించింది. వండర్ యార్న్ సెగ్మెంట్ నుంచి విశాకాకు సెప్టెంబర్ క్వార్టర్ లో రూ. 51.15 కోట్ల రెవెన్యూ వచ్చింది. కిందటేడాది క్యూ2 లో రూ. 24.28 కోట్ల రెవెన్యూ ని కంపెనీ ప్రకటించింది. 'కరోనా వలన ఏర్పడిన సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో, ఫోకస్‌తో కంపెనీ పనిచేసింది. ఎకానమీ రికవరీ అవుతుండడంతో వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడుతోంది. భవిష్యత్తులో కంపెనీ పెర్ఫార్మెన్స్ మరింత పెరుగుతుంది. ఆటమ్ ఛార్జ్, ఆటమ్ లైఫ్, వీ నెక్స్ట్ బోర్డ్ సెగ్మెంట్స్ తో సస్టయినబుల్ ఫ్యూచర్ కు కట్టుబడి ఉన్నాం' అని విశాక ఇండస్ట్రీస్ జాయింట్ ఎమ్‌డీ జీ. వంశీకృష్ణ అన్నారు.
బిజినెస్ విస్తరిస్తోంది..
విశాక ఇండస్ట్రీస్ రాయ్ బరేలి లో తమ రెండో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి లక్ష టన్నులు. దీనితో కంపెనీ మొత్తం కెపాసిటీ ఏడాదికి 9 లక్షల టన్నులకు చేరుకుంటుంది. ఉడుమల్‌పేట్, కోయంబత్తూర్‌లలో ఏర్పాటు చేస్తున్న ఫైబర్ సిమెంట్ బోర్డ్ ప్లాంట్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
