ఆ జూలో.. జిరాఫీ చనిపోయింది.. మొన్న పులి

ఆ జూలో.. జిరాఫీ చనిపోయింది.. మొన్న పులి

విశాఖ ఇందిరాగాంధీ జూ పార్కులో వరుస వన్యప్రాణుల మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జత జీబ్రాలలో రాణీ అనే జీబ్రా మార్చి 12న మృతి చెందగా, తాజాగా పదేళ్ల వయస్సు గల  మే  అనే ఆడ జిరాఫీ ఈనెల 17న  మృత్యువాత పడింది. దీనితో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన జంతువులు మృతి చెందడంతో ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి జూలో నెలకొంది. కాగా జూలో జంతువులకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 రెండు వారాలుగా ఆరోగ్యం క్షీణించింది

మే అనే జిరాఫీ  మూడు నెలలుగా క్రానికి మెట్రిటిస్‌ న్యుమేనియా అనే వ్యాధితో బాధ పడుతున్నట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారీయా తెలిపారు.  జిరాఫీని కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశామని, కానీ ఫలితం లేకపోయిందన్నారు. ముఖ్యంగా రెండు వారాలుగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, రెండు రోజులుగా ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేసిందని చెప్పారు. 

గైనిక్‌ సమస్యతో...

మలేషియా దేశంలోని నెగ్రా జూ పార్కు నుంచి 2013లో అప్పటి జూ క్యూరేటర్‌ రామలింగం ఓ జత జిరాఫీలను ఇక్కడకు తీసుకొచ్చారు. మలేషియా నుంచి ఓడలో మూడు జిరాఫీలను చైన్నె పోర్టుకు తీసుకొస్తుండగా.. వాటిలో మగ జిరాఫీ సముద్ర మార్గ మధ్యలోనే మృతి చెందింది. మిగిలిన జిరాఫీలు విశాఖ జూ పార్కుకు చేరాయి. అప్పటికి మగ జిరాఫీ(బేకన్‌) వయసు ఏడాదిన్నర కాగా.. ఆడ జిరాఫీ(మే)కి నాలుగు నెలలే.. అవి జూలోనే పెరిగి పెద్దయ్యాయి. ఈ క్రమంలో జిరాఫీల సంఖ్యను వృద్ధి చేయాలనే ఆలోచనతో 2019లో అప్పటి క్యూరేటర్‌ యశోదబాయి వాటి పునరుత్పత్తికి బాటలు వేశారు. ఈ నేపథ్యంలో గర్భం దాల్చిన ఆడ జిరాఫీకి పుట్టిన పిల్ల 12 రోజుల్లో మృతి చెందింది. మరోసారి 2020లో కూడా గర్భం దాల్చిన ఆ జిరాఫీ కడుపు లోపలే పిల్ల మరణించింది. అప్పటి నుంచి ‘మే’ గైనిక్‌ సమస్యతో బాధపడుతున్నట్లు జూ అధికారులు తెలిపారు. ఈ సమస్య మరింత విషమించి.. మూడు నెలలుగా ఆహారం కూడా సరిగా తీసుకోకపోవడంతో నీరసించి చనిపోయింది. ప్రస్తుతం  మగ జిరాఫీ (బేకన్‌) ఎన్‌క్లోజర్‌లో ఒంటరిగా మిగిలిపోయింది. సాధారణంగా జిరాఫీలు 20 నుంచి 25 ఏళ్లు జీవిస్తాయి. జూలో మంచి వైద్యం, ఆహారం క్రమం తప్పకుండా అందిస్తారు కాబట్టి.. వాటి జీవిత కాలం మరింత పెరుగుతుంది. కానీ ఇక్కడ జిరాఫీ 10 ఏళ్లకే మృత్యువాత పడటం.. జూ అధికారులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
 

ఆస్పత్రి ఉన్నా..

విశాఖ జూలో పూర్తిస్థాయి ఆస్పత్రి ఉంది. ఇన్‌పేషెంట్‌ వార్డు కూడా నిర్మించారు. అనారోగ్యానికి గురయ్యే వన్య ప్రాణులను ఇక్కడ ఇన్‌పేషెంట్‌ వార్డులో చికిత్స ఉందించే వీలుంది. ఇక్కడ సీనియర్‌ వైద్యుడు, అసిస్టెంట్‌తో పాటు సహాయకులు కూడా ఉన్నారు. అయినా వైద్య సేవలు సరిగా అందకపోవడం వల్లే వన్యప్రాణులు తరచూ మృత్యువాత పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో మూడు జంతువులు చనిపోవడంపై సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కులోని జంతువులు, పక్షులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

వన్యప్రాణుల సంతతి పెరగడం లేదు

విశాఖ ఇందిరా గాంధీ జూ పార్కుకు  అరుదైన జంతువులను విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో జూ పార్కుల నుంచి తీసుకొచ్చినా వాటి సంతతి పెరగడం లేదు కదా.. ఒక్కొక్కటిగా సందర్శకులకు దూరమవుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో జీబ్రా, తెల్లపులి, జిరాఫీ మృతి చెందడం బాధాకరం. ఇవన్నీ ఆడ జంతువులే. దీంతో వాటి సంతతి వృద్ధి చెందే అవకాశం లేకుండాపోయింది. జీబ్రా, తెల్ల పులి, జిరాఫీ జూకు రాక ముందు వాటి జాడ లేదు. జతలుగా ఇక్కడకు వచ్చిన ఆయా జంతువులు ప్రస్తుతం ఒంటరయ్యాయి. ప్రస్తుతం ఒంటరైన జంతువుల తోడు కోసం.. ఇతర జూ పార్కుల నుంచి ఆయా జంతువులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని జూ అధికారులు తెలిపారు.