నాకే సిగ్గుగా ఉంది.. చెన్నై అధికారుల తీరుపై విశాల్‌ ఆగ్రహం!

నాకే సిగ్గుగా ఉంది.. చెన్నై అధికారుల తీరుపై విశాల్‌ ఆగ్రహం!

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మిచౌంగ్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ నుంచి అతి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హీరో విశాల్ చెన్నై ప్రజలను ఉద్ధేశిస్తు తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఒక ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్ లో విశాల్.. చెన్నై మేయర్ ప్రియా రాజన్, గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్, ఇతర అధికారులు.. మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ ఇంట్లోకి డ్రైనేజీ నీళ్లు రాలేదు కదా? నిత్యావసర సరుకులు మీ ఇంటికే వస్తున్నాయ్ కదా? కానీ.. మీరు ఓ సాధారణ ఓటరు గురించి ఆలోచిస్తున్నారా? మీ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నారా?

మీరుంటున్న సిటీలోనే మేము కూడా ఉన్నాం కానీ.. మీలాంటి స్థితిలో మాత్రం లేము. తుఫాను నీళ్ల డ్రైన్ ప్రాజెక్ట్ చేసింది చెన్నై కోసమా లేక సింగపూర్ కోసమా? 2015లో వరదలు వచ్చినప్పుడు మేమంతా సహాయం చేశాం. విపత్కర పరిస్థితుల్లో సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాం. ఎనిమిదేళ్ల తరువాత కూడా అదే పరిస్థితి. అంతకు మించి దారుణంగా మారింది పరిస్థితి. ఈ సారి మీ అధికారులు, ప్రతినిధులు ముందుకు రావాలి. ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవాలి. ఇలా రాస్తునందుకు నాకే సిగ్గుగా ఉంది. మీరేమీ అద్భుతాలు చేయాలని అనుకోవడం లేదు.. కనీసం మీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే చాలు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాల్. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ పై చెన్నై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.