
- బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
- తనకు పార్టీ టికెట్ రాకుండా కొందరు నాయకులు అడ్డుకున్నారని ఆవేదన
- నామినేషన్ రోజు తన సగం ఆస్తిని షాద్ నగర్ ప్రజలకు రాసిస్తానని వెల్లడి
- ఆత్మీయ సమ్మేళనంలో కంటతడి
షాద్ నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత, పాలమూరు ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. షాద్ నగర్ లో డిపాజిట్ కూడా రాని బీజేపీని ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న పార్టీ గా తయారు చేశానని, అలాంటి తనకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలో విష్ణువర్ధన్ రెడ్డి తన అభిమానులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 2018 లో బీజేపీ కండువా కప్పి తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తుచేశారు.
ఒక అంతర్జాతీయ స్థాయి నేత తనను బీజేపీలోకి ఆహ్వానించారంటే పార్టీని తన సొంతంగా భావించానని చెప్పారు. ‘‘మోదీ, అమిత్ షా సభలకు లక్షల రూపాయలు సొంతంగా ఖర్చుపెట్టి వేల మందిని తరలించి పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశా. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా దిగమింగుకొని పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేశా. నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా. ఈ సేవా కార్యక్రమాలకు దాదాపు రూ.27 కోట్లు ఖర్చుచేశా. కానీ, చివరికి కొందరు నాయకులు పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ టికెట్ నాకు రాకుండా అడ్డుపడ్డారు” అని విష్ణువర్ధన్ కంటతడి పెట్టారు. నాయకులు అందరూ రాజకీయాల్లో పేరు, డబ్బు సంపాదించుకుంటే తాను ప్రజల గుండెల్లో పేరు సంపాదించానని చెప్పారు.
నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లలో బీజేపీ టికెట్ ఎవరికి ఇవ్వాలని అడిగినా తన పేరే చెబుతారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నామినేషన్ వేసే రోజున తన సగం ఆస్తిని షాద్ నగర్ ప్రజలకు రాసిస్తానని వెల్లడించారు. అనంతరం బీజేపీ నాయకులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు పసుల నర్సింహ యాదవ్, ఆకుల ప్రదీప్, మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.