ఎవరూ రావొద్దు.. చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు

ఎవరూ రావొద్దు..  చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు

చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు అంటే ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం  జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు అయింది.  ఈ విషయాన్ని  ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ వెల్లడించారు.  వివాహ ప్రాప్తి కోసం రేపు కళ్యాణోత్సవానికి ఎవరు రావద్దని ఈ సందర్భంగా సూచించారు.  నిన్న గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందుల దృష్ట్యా వివాహ ప్రాప్తిని రద్దు చేశామన్నారు.  పెళ్లి కావాల్సిన వాళ్లు ఇళ్లల్లో నుంచే దేవుడ్ని ప్రార్థించాలని తెలిపారు.  రేపు సాయంత్రం జరిగే కళ్యాణోత్సవం యథాతథంగా జరుగుతుందని  రంగరాజన్ వెల్లడించారు.  

నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్​లో గరుడ ప్రసాదం కోసం జనం పోటెత్తారు. ఆ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని సోషల్​మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. మహిళలు భారీగా తరలివచ్చారు. ఎర్రటి ఎండలో కిలో మీటర్ల దూరంలో తమ వాహనాలను నిలిపి.. కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. గుడి వద్ద కూడా దాదాపు కిలో మీటర్ మేర బారులు తీరారు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని గత నెల రోజుల నుంచి ఆలయ ఆర్చకులు సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.