Operation Sindoor: వెండితెరపై రియల్ సర్జికల్ స్ట్రైక్స్.. 'ఆపరేషన్ సిందూర్' ప్రకటించిన వివేక్ అగ్నిహోత్రి!

Operation Sindoor: వెండితెరపై రియల్ సర్జికల్ స్ట్రైక్స్.. 'ఆపరేషన్ సిందూర్' ప్రకటించిన వివేక్ అగ్నిహోత్రి!

‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇప్పుడు ఈ డైరెక్టర్ మరో పవర్‌ఫుల్ అన్ టోల్డ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భారత సైనిక పరాక్రమాన్ని, దౌత్య వ్యూహాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) అనే ప్రాజెక్ట్‌ను ఆయన లేటెస్ట్ గా ప్రకటించారు. ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ తో వివేక్ చేతులు కలిపారు.

వెన్నులో వణుకు పుట్టించే ఆపరేషన్!

ఈ చిత్రం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ‘టైనీ’ ధిల్లాన్ రాసిన "Operation Sindoor: The Untold Story of India’s Deep Strikes Inside Pakistan" అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది. కథా నేపథ్యం విషయానికి వస్తే.. 2025లో పహల్గామ్ వద్ద పర్యాటకులు, సామాన్య పౌరులపై జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతికారంగా భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత రహస్యమైన, శక్తివంతమైన ఆపరేషన్ ఇది. పాకిస్థాన్,  పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ఎలా మట్టుబెట్టిందో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.

ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి!

ఈ ఆపరేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ చరిత్రలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య జరిగిన యుద్ధతంత్రంలో.. ఒక దేశం మరో దేశం లోపలికి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇదే మొదటిసారి. పాకిస్థాన్ ఎప్పుడూ చూపే అణు హెచ్చరికలను భారత్ ఎలా బద్దలు కొట్టిందో, వారి అణ్వాయుధ బెదిరింపులు ఉగ్రవాదానికి రక్షణ కవచం కాలేవని భారత్ ఎలా నిరూపించిందో ఈ సినిమా స్పష్టం చేయనుంది.

వివేక్ అగ్నిహోత్రి మాటల్లో..

ఈ మూవీకి సంబంధించిన విశేషాలను వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక నిజాన్ని వెలికితీయడం. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ ఎంతటి శక్తివంతమైనదో ఈ చిత్రం చూపిస్తుంది. భారత సాయుధ దళాలలోని వివిధ విభాగాల సహకారంతో లోతైన పరిశోధన చేసి ఈ కథను సిద్ధం చేశాం. వాస్తవాలను క్లారిటీతో ప్రపంచానికి చాటి చెప్పడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు.

దేశభక్తి, సైనిక పోరాటాల చిత్రాలకు క్రేజ్..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న స్పై థ్రిల్లర్ 'ధురందర్ 2'  దూసుకెళ్తోంది. ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ఇలాంటి తరుణంలో వివేక్ అగ్నిహోత్రి 'ఆపరేషన్ సిందూర్' ప్రకటన సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశభక్తి, సైనిక పోరాటాల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రస్తుతం ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉందని ఇటీవల వస్తున్న సినిమాలు రుజువు చేస్తున్నాయి.

భారీ బడ్జెట్ తో ఈ మూవీని టీ-సిరీస్, ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రంలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు. వాస్తవ ఘటనలను వెండితెరపై ఆవిష్కరించడంలో దిట్ట అయిన వివేక్ అగ్నిహోత్రి, ఈసారి పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఖాయంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.