టాప్​-3 ఎకానమీగా భారత్​

టాప్​-3 ఎకానమీగా భారత్​
  • విద్యా, వైద్య రంగంలో దూసుకుపోతున్నది : వివేక్
  • సికింద్రాబాద్​ పాట్​ మార్కెట్​ పంద్రాగస్టు వేడుకలో కామెంట్​

బషీర్​బాగ్/ సికింద్రాబాద్, వెలుగు: ప్రధాని మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని.. తొందరలోనే ప్రపంచంలోనే మూడో ఎకానమీగా నిలవనుందని వివేక్ వెంకట స్వామి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లో ఎడ్ల మధుకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టువేడుకలకు చీఫ్ గెస్టుగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. దేశ జీడీపీ గణనీయంగా వృద్ధి సాధించిందన్నారు. భారత్ విద్యా వైద్య రంగంలో దూసుకుపోతుందన్నారు. హెల్త్​క్యాంప్​ను ప్రారంభించి..  దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో నార్త్​జోన్ ​డీసీపీ చందనా దీప్తి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
చింతల్​బస్తీలో కాకా మెమోరియల్​ హాల్​ ప్రారంభం
ప్రస్తుత పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. పాలకులు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడంలో యువత ముందుండాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చింతల్​బస్తిలో కాకా వెంకటస్వామి మెమోరియల్ హాల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చింతలబస్తితో తన తండ్రి వెంకటస్వామికి ఎంతో అనుబంధం ఉందన్నారు. 
1978 లో ఆయన కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఇక్కడే వాలీ బాల్ క్లబ్ భవనాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంకటస్వామి ఫౌండేషన్ తరఫున ఫండ్స్ ఇచ్చి కొత్త భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. పిల్లలకు చదువుకోవడానికి మంచి వాతావరణం క్రియేట్ చేస్తే.. భవిష్యత్తులో రాణిస్తారని ఆకాంక్షించారు. చదువు ద్వారానే అణగారిన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని అంబేద్కర్ చెప్పారని.. ఆయన ఆకాంక్ష మేరకు అంబేద్కర్ విద్యాసంస్థలను ప్రారంభించి ఎంతో మందికి విద్య అందిస్తున్నామన్నారు. 
కార్యక్రమంలో వెంకటస్వామి మెమోరియల్ హాల్ వాలీబాల్ క్లబ్ చైర్మన్ ఆకుల నర్సింగ్ రావు, కాంతి కిరణ్, మహేందర్, మీస కృష్ణ, విజయ్ కుమార్, కేశవ్, శైలేందర్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.