బీజేపీతోనే అవినీతి లేని పాలన: వివేక్ వెంకటస్వామి

బీజేపీతోనే అవినీతి లేని పాలన: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. కర్నాటకలో కంటే తెలంగాణలో పెట్రోల్ రేటు రూ.12 ఎక్కువని, దీని ప్రభావంతో ప్రయాణ చార్జీలు కూడా పెరిగాయన్నారు. దేశంలో ఏయే రాష్ట్రాల్లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో అక్కడ పెట్రోల్ ​రేట్లు చాలా తక్కువ ఉన్నాయన్నారు. శనివారం ఆయన కర్నాటక రాష్ట్రం కుష్టగి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొడ్డనగౌడ పాటిల్​తో కలిసి కుష్టగి పట్టణంలోని 21, 22, 23 వార్డులు, జహాగిర్ గుడ్దుర్, మిట్టలకోడ్, తుగ్గల్డోని గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్​ ఇంజిన్ సర్కార్​తో రాష్ట్ర ప్రజలకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు. ప్రధాని మోడీ సారథ్యంలో అవినీతి, అక్రమాలకు తావులేని పాలన అందుతున్నదని చెప్పారు. ట్రిపుల్ తలాక్​ రద్దుతో ముస్లిం మహిళల జీవితాలకు భద్రత చేకూర్చారు. ఈ చట్టం వచ్చాక వాళ్లలో భయం, అభద్రత తొలగి చాలా ఖుషీగా ఉంటున్నారని తెలిపారు.  జహాగిర్ గుడ్దుర్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత బీజేపీ బూత్​ కమిటీలతో సమావేశమై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తుగ్గల్డోని గ్రామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీలో చేరిన గ్రామ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.