కోదండరామ్ను కేసీఆర్ వాడుకుని వదిలేశారు : జీ.వివేక్ వెంకటస్వామి

కోదండరామ్ను కేసీఆర్ వాడుకుని వదిలేశారు : జీ.వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ ను కేసీఆర్ వాడుకుని వదిలేశారని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకట స్వామి అన్నారు. కేసీఆర్ మోసం చేసిన వారిలో తాను ఒక బాధితుడిని అని చెప్పారు. ఎన్నికల  అవకాశాన్ని వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరులో 40 సమావేశాలకు హాజరయ్యానని, నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా.. ప్రతి ఒక్కరూ బాల్క సుమన్ ఒకసారైనా రాలే అనే మాటే వినిపించిందన్నారు. 

అధికారంలో ఉన్నా.. లేకున్నా తాను ఎల్లప్పుడు ప్రజా సేవలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ చెన్నూరులోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మందమర్రిలో అసంపూర్తిగా ఉన్న లెదర్ పార్క్ ను పూర్తి చేస్తానని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకట స్వామి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, సింగరేణి జేఎసీ కన్వీనర్ మునీర్ హాజరయ్యారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం10 ఏండ్లలో ప్రజలకు చేసిందేంటని జనం నిలదీస్తున్నరని అన్నారు కోదండరాం. పేపర్ లీకేజీ కారణంగా యువతి ఆత్మహత్య చేసుకుంటే.. అబ్బాయితో చాయ్ తాగిన ఫోటోలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగం కోసం విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని అంటే ఎన్నికలపై ప్రభావం పడుతుందనే ఆమెపై మచ్చవేశారని చెప్పారు. తెలంగాణ యువత ఎందుకు మరోసారి కేసీఆర్ కు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన అవమానాలన్నీ గుర్తు పెట్టుకుని కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు పోలీసులు ఇంటికి రావాలంటే భయపడేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటి తలుపులు బద్దలుకొట్టుకుని వస్తున్నారని చెప్పారు.