- బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి
- బ్యారేజీల బ్యాక్ వాటర్‌తో పంటలు మునుగుతున్నయ్
- ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలి
- మంచిర్యాల జిల్లాలో మునిగిన పంటల పరిశీలన
- ఈటల రాజేందర్‌తో కలిసి కమలాపూర్‌లో పాదయాత్ర
మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నాడని, రైతులకు మాత్రం కన్నీళ్లు మిగిల్చాడని బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కాళేశ్వరం రీ డిజైనింగ్ రాంగ్ అని, ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో మంచిర్యాల జిల్లాలో 20 వేల ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నాయని, రైతులు మూడేళ్లుగా నష్టపోతున్నా ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదని విమర్శించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల బ్యాక్ వాటర్‌తో మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం వేలాల, కోటపల్లి మండలం దేవులవాడలో దెబ్బతిన్న పంటలను వివేక్ పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవి. రూ.36 వేల కోట్లతోనే ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది. కానీ సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం రీ డిజైనింగ్ చేసి రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. ఇందులో రూ.55 వేల కోట్ల ఫ్రాడ్ జరిగింది. ఈ అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి’’ అని డిమాండ్ చేశారు. కమీషన్లు, అవినీతి డబ్బును కేసీఆర్ ఉప ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నాడని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, ముంపు భూములను ప్రభుత్వమే సేకరించి ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ముంపు బాధితులను ఆదుకోవాలి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి రూ.10 వేల సాయం అందించాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని వివేక్ డిమాండ్ చేశారు. రాంనగర్‌లో ముంపునకు గురైన ఇండ్లను పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. వరద ముంచే దాకా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కనీసం అప్రమత్తం చేయలేదని, ఎమ్మెల్యే దివాకర్‌రావు వచ్చి వెళ్లారు తప్ప ఎలాంటి సహాయం అందించలేదని బాధితులు వాపోయారు. తెల్లారేసరికి ఇండ్లలో నడుముల దాక నీళ్లు చేరాయని, పాములు వచ్చాయని, సామాన్లు, నిత్యావసర సరుకులు తడిసిపోయాయని, వాహనాలు పాడయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్ మాట్లాడుతూ.. రాష్ర్టవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో పలు కాలనీలు నీటమునిగాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వంద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
గోడు వెల్లబోసుకున్న రైతులు
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే తమ పంటలు మునిగిపోయాయని రైతులు వివేక్‌కు చెప్పారు. ఆ ప్రాజెక్టు తమకు కన్నీళ్లు తెప్పిస్తోందని, పంటలను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టిన మూడేళ్ల నుంచి పంటలు మునిగి నష్టం జరుగు తోందని, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. ఆఫీసర్లు వచ్చి సర్వే చేసి రాసుకుని పోతున్నారే తప్ప పరిహారం మాత్రం రావడం లేదన్నారు. దెబ్బతిన్న పంటలను చూడడానికి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ రాలేదని, ఆయన ఎప్పుడో రాత్రిళ్లు వచ్చిపోతున్నాడని చెప్పారు. ప్రజలను కలవడం లేదని, సమస్యలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
