
- సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి
- ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు, పవర్ ప్లాంట్‌లో లోకల్స్ కే అవకాశమివ్వండి
- బయటి వ్యక్తులను తీసుకోకుండా కాంట్రాక్టర్లకు ఆదేశాలివ్వాలని వినతి
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులు, పవర్‌ప్లాంట్‌లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. ఈ మేరకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్‌లో రేవంత్‌తో వివేక్ భేటీ అయ్యారు. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయమై చర్చించారు. ‘‘నేను 2009 నుంచి 2014 వరకు పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జీవో ఇప్పించాను. కానీ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ జీవోను పక్కనపెట్టింది. దీంతో కాంట్రాక్టర్లు వేరే రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకొచ్చి, ఉద్యోగాల్లో పెట్టుకున్నారు. ఫలితంగా స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం జరిగింది” అని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘సింగరేణి పవర్ప్లాంట్ఏర్పాటుకు ఇక్కడి ప్రజలు భూములు ఇచ్చారు. ఆ సమయంలో ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీంతో భూములు కోల్పోయి, ఉద్యోగాలు రాకపోగా.. ఓసీపీలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యాన్ని జనం భరిస్తున్నారు. ఈ నెలలో కొత్త అగ్రిమెంట్లు జరుగుతాయి. స్థానికులనే ఉద్యోగాల్లో నియమించుకునేలా, బయటి వ్యక్తులను తీసుకోకుండా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి” అని కోరారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని వివేక్ హామీ ఇచ్చారు.
దొరల సర్కారును ఓడించడంలో వివేక్‌ది ముఖ్యపాత్ర: జాజుల
హైదరాబాద్, వెలుగు:పేదలు, బడుగు బలహీన వర్గాల వారి మేలు కోసం పోరాడిన కాకా వెంకటస్వామి బాటలోనే ఆయన తనయుడు వివేక్ వెంకటస్వామి నడుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దొరల ప్రభుత్వాన్ని ఓడించడంలో వివేక్ అత్యంత క్రియాశీలంగా పనిచేశారని పేర్కొన్నారు. సోమవారం మాలమహానాడు జాతీయాధ్యక్షుడు జి.చెన్నయ్యతో కలిసి వివేక్ వెంకటస్వామిని ఆయన నివాసంలో కలిశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా శాలువాతో సన్మానించారు. బడుగు, బలహీనవర్గాలకు వ్యతిరేకంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను వివేక్ ఎండగట్టారని, ఆయన సేవలను గుర్తించి కేబినెట్ హోదా ఇవ్వాలని సోనియా, రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు.