ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్​ ఏమైంది?

ఉస్మానియా ఆస్పత్రి  కొత్త బిల్డింగ్​ ఏమైంది?

హైదరాబాద్, వెలుగుఐదేండ్ల క్రితం ఉస్మానియా హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్​ నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్​ ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కనీసం నిధులిచ్చి రెనోవేషన్ కూడా చేయటం లేదని, వర్షంతో రెండుసార్లు హాస్పిటల్ లోకి నీరుచేరి పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మరిచిన సీఎం ప్రాజెక్టుల రీడిజైనింగ్​ గురించే ఆలోచిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఉన్న భవనాలను కూల్చి కొత్తవి నిర్మించి తన పేరు పెట్టుకోవాలని తపన పడుతున్నారని, ఇందులో భాగంగా ఎర్రమంజిల్, సెక్రటేరియట్ ను కూల్చివేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రెస్​నోట్​ విడుదల చేశారు.

ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలి

రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ప్రజలకు అందే సౌకర్యాలను పెంచాలని సీఎం కేసీఆర్​కు వివేక్​ సూచించారు. ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బీదల దవాఖానా ఉస్మానియాలో మంచి ట్రీట్మెంట్ ఇస్తరని ప్రజలకు నమ్మకం ఉంది. కరోనా నివారణకు ఉస్మానియాకు ఎక్కువ నిధులిచ్చి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. పాతబస్తీ ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఉస్మానియా హాస్పిటల్ కు నిధులు కేటాయించి, ఆధునీకరించి ప్రజలకు మంచి ఫెసిలిటీస్​ అందించాలని సీఎంకు సూచిస్తున్నాను. కరోనా టైంలో సరైన వైద్య సౌకర్యాలు లేక ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ప్రజలకు సౌకర్యాలు కల్పించకుండా సెక్రటేరియట్ ను కూల్చేస్తున్నారు. రూ.500 కోట్లతో కొత్తది నిర్మిస్తా అంటున్నారు. సెక్రటేరియట్ పూర్తయ్యే సరికి కనీసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.30 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు ఎలా పెంచారో సెక్రటేరియట్ కు కూడా అంతే అవుతుంది. ఇదంతా అనవసర ఖర్చు. వందేండ్ల చరిత్ర కలిగిన సెక్రటేరియట్ ను కూల్చి కొత్తది కట్టి ప్రజలపై ఎందుకు భారం వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి పాలన చేయొద్దని, మంచిది కాదని సీఎంకు సలహా ఇస్తున్నా. గాంధీ లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. సామాన్యులు గాంధీ, ఉస్మానియాకు వెళితే బెడ్లు లేవు, వెంటిలేటర్లు లేవంటున్నారు. అధికారులతో సీఎం తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న సీఎం.. హాస్పిటళ్లలో పరిస్థితిపై సమీక్ష చేయాలి. వాటిలో సౌకర్యాలు మరింత మెరుగుపరచాలి’’ అని వివేక్ డిమాండ్ చేశారు.