కాంగ్రెస్​ థర్డ్​ లిస్టు.. చెన్నూరు బరిలో వివేక్​ వెంకటస్వామి

కాంగ్రెస్​ థర్డ్​ లిస్టు..  చెన్నూరు బరిలో వివేక్​ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడో లిస్ట్​ రిలీజ్​ అయింది. 16 మంది పేర్లతో సోమవారం రాత్రి ఈ జాబితాను విడుదల చేసింది. గత లిస్టుల్లో ప్రకటించిన వనపర్తి, బోథ్​ స్థానాలకు అభ్యర్థులను మారుస్తూ కొత్తవారితో ఆ స్థానాలను కూడా ఈ లిస్టులో చేర్చింది. కామారెడ్డిలో కేసీఆర్​పై పోటీకి పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి పేరును థర్డ్​ లిస్టులో ఖరారు చేసింది. అటు కొడంగల్​తోపాటు ఇక కామారెడ్డిలోనూ రేవంత్​ పోటీ చేయనున్నారు. చెన్నూరు స్థానాన్ని మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామికి కాంగ్రెస్​ పార్టీ కేటాయించింది. 

నిజామాబాద్​ అర్బన్​ స్థానాన్ని షబ్బీర్​ అలీకి, పటాన్​చెరు టికెట్​ను నీలం మధుకు ఓకే చేసింది. మొదటి రెండు జాబితాల్లో 100 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో రెండు సీట్లను మారుస్తూ 16 మందితో ఈ మూడో జాబితాను కాంగ్రెస్​ రిలీజ్​ చేసింది. దీంతో ఇప్పటివరకు 114 సీట్లకు కాంగ్రెస్​ అభ్యర్థులు ఖరారయ్యారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్​ హైకమాండ్​.. మరో నాలుగు సీట్లను పెండింగ్​లో పెట్టింది. ఇందులో మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ ఉన్నాయి. పెండింగ్​ స్థానాలకు మంగళవారం అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

బోథ్​, వనపర్తిలో మార్పు

గత జాబితాల్లో బోథ్​ స్థానాన్ని  వెన్నెల అశోక్​కు, వనపర్తి స్థానాన్ని చిన్నారెడ్డికి కేటాయించిన కాంగ్రెస్​.. వాటిలో అభ్యర్థులను మార్చింది. బోథ్​ను ఆడే గజేందర్​కు, వనపర్తిని తూడి మేఘా రెడ్డికి ఇస్తూ మూడో లిస్టులో వారి పేర్లు చేర్చింది. 

ముగ్గురు బీసీలకు

మూడో లిస్ట్​లో ముగ్గురు బీసీలకు కాంగ్రెస్​ పార్టీ సీట్లు ఇచ్చింది. కరీంనగర్​, నారాయణఖేడ్​, పటాన్​చెరు స్థానాలను బీసీలకు ఇచ్చింది. కామారెడ్డి నుంచి రేవంత్​ రెడ్డి పోటీ చేస్తుండడంతో.. ఆ స్థానానికి అప్లై చేసుకున్న షబ్బీర్​ అలీకి నిజామాబాద్​ అర్బన్​ టికెట్​ను కేటాయించింది. ఇటీవల పార్టీలో చేరిన ఏనుగు రవీందర్​ రెడ్డికి బాన్సువాడ, నీలం మధు ముదిరాజ్​కు పటాన్​చెరు టికెట్ల​ను కన్ఫామ్ చేసింది. పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి  అనుచరుడు కోరం కనకయ్యకు ఇల్లందు టికెట్​ దక్కింది. సత్తుపల్లి టికెట్​ కోసం ఓయూ జేఏసీ నేత మానవతారాయ్​ అప్లై చేసుకున్నా ఆయనకు దక్కలేదు. డాక్టర్​ మట్టా రాగమయికి ఈ టికెట్​ కేటాయించారు.