కాళేశ్వరం ముంపు రైతులకు భూమికి బదులు భూమి ఇప్పించండి

కాళేశ్వరం ముంపు రైతులకు భూమికి బదులు భూమి ఇప్పించండి
  • కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరిన వివేక్ వెంకటస్వామి
  • రాష్ట్ర సర్కార్​కు ఆదేశాలు ఇవ్వాలని వినతి 
  • ముంపు గ్రామాల రైతులతో కలిసి భేటీ 
  • సహాయ మంత్రితోనూ మీటింగ్.. రాష్ట్ర సర్కార్ కు లేఖ రాస్తామన్న కైలాశ్ చౌదరి 

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ముంపు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కోరారు. రైతులను ఆదుకునేలా రాష్ట్ర సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలోని కృషి భ‌‌వన్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరితో వివేక్ భేటీ అయ్యారు. బీజేపీ చెన్నూరు ఇన్ చార్జ్ అందుగుల శ్రీనివాస్, ముంపు రైతులతో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ముంపు గ్రామాల రైతులు పడుతున్న గోసను కేంద్ర మంత్రికి వివేక్ వివరించారు. గోదావ‌‌రి, ప్రాణ‌‌హిత ప‌‌రీవాహ‌‌క ప్రాంతాల్లో బ్యాక్ వాట‌‌ర్ తో రైతులకు జరుగుతున్న నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమకు జరుగుతున్న నష్టంపై రైతులు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. 

రీడిజైన్ తోనే ముంపు... 
కేంద్ర మంత్రితో స‌‌మావేశం అనంత‌‌రం వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూర్, మంథ‌‌ని నియోజ‌‌కవ‌‌ర్గాల్లో దాదాపు 40 వేల ఎక‌‌రాల్లో పంటలు ముంపుకు గుర‌‌వుతున్నాయ‌‌ని ఆయన చెప్పారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు రైతుల‌‌కు భూమికి బ‌‌దులు మరో చోట సాగు భూమి, ఎకరానికి రూ.40 వేల న‌‌ష్టప‌‌రిహారం ఇచ్చేలా రాష్ట్ర సర్కార్ కు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. క‌‌మీష‌‌న్ల కోసమే కాళేశ్వరం కడుతున్నారని.. అందులో భాగంగానే కేసీఆర్ ప్రాజెక్టును రీడిజైన్ చేశార‌‌ని ఆరోపించారు. కేసీఆర్ తీసుకున్న ఈ తుగ్లక్ నిర్ణయంతోనే బ్యాక్ వాటర్ వల్ల చెన్నూరు నియోజ‌‌కవ‌‌ర్గంలోని చాలా గ్రామాలు ముంపుకు గుర‌‌వుతున్నాయ‌‌న్నారు. ఇదే విష‌‌యాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామ‌‌ని, తమ విజ్ఞప్తులకు ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.  

పరిహారమివ్వాలె: అందుగుల శ్రీనివాస్
కాళేశ్వరం ముంపు గ్రామాల రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీజేపీ చెన్నూరు ఇన్‌చార్జ్ అందుగుల శ్రీనివాస్ అన్నారు. పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే వేలాది మందితో వెళ్లి ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్టులు చేసినా, జైలుకు పంపినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో ఏం జరుగుతున్నదో అందరికీ తెలియాలని, అప్పుడే రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచకాలు, దోపిడీల గురించి దేశమంతా తెలుస్తుందని అన్నారు.

ట్రిపుల్ ఐటీలో వెంటనే సౌలత్​లు కల్పించాలె: వివేక్
సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి మద్దతు తెలిపారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వేలాది మంది విద్యార్థులు వర్షంలో తడుస్తూనే వర్సిటీలో రోడ్డుపై బైఠాయించి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నా కూడా టీఆర్​ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. వర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీ నియామకం, తాగునీరు, నాణ్యమైన భోజనం, ఫ్యాన్లు, యూనిఫామ్ వంటి కనీస వసతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. వర్సిటీకి రెగ్యులర్​వీసీని నియమించాలని కోరారు.

న్యాయం జరిగేలా చూస్తాం: కైలాశ్ చౌదరి 
అంత‌‌కుముందు కేంద్ర వ్యవసాయ శాఖ స‌‌హాయ మంత్రి కైలాశ్ చౌద‌‌రితో వివేక్, రైతుల బృందం సమావేశమైంది. ఈ మీటింగ్ లో అందరి రైతులతోనూ కేంద్ర మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ముంపు గ్రామాల ప‌‌రిస్థితి, నష్టపోతున్న రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల రైతులకు న్యాయం జ‌‌రిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వర‌‌లోనే కాళేశ్వరం బ్యాక్ వాట‌‌ర్ పై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. అంత‌‌వ‌‌ర‌‌కు రైతులు ధైర్యంగా ఉండాల‌‌ని భ‌‌రోసా ఇచ్చారు.