
హైదరాబాద్, వెలుగు: కర్నాటకలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కుష్టగి నియోజకవర్గ ఓటర్లను ఆ సెగ్మెంట్ ఇన్చార్జ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుష్టగి సెగ్మెంట్ పరిధిలోని హూలిగిరి గ్రామంలో సమావేశం నిర్వహించారు. బసవేశ్వరుడి 890వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సమాజంలో కుల వ్యవస్థ, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది, లింగాయత్ ధర్మం స్థాపకుడు బసవేశ్వరుడు అని కొనియాడారు. తర్వాత బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా, హనుమానాల గ్రామంలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ అభ్యర్థి హనుమగౌడ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. కర్నాకటలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.