
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మంగళవారం హుబ్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్, వెలుగు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం కొప్పళ్ జిల్లా కుష్టగి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి బీజేపీ అభ్యర్థి దొడ్డనగౌడ హనుమగౌడ పాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కుష్టగి ఎన్నికల ప్రచారం ఇన్ చార్జ్‌గా ఉన్న వివేక్ వెంకటస్వామి, కొప్పళ్ ఎంపీ సగ్గన కారడి, పార్టీ నేత బస్వరాజ్ హల్లుర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యంలోని బీజేపీకి జనం నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ఈ ఉత్సాహం చూస్తుంటే కర్నాటకలో పార్టీ ఘన విజయం సాధించడం గ్యారెంటీ అన్నారు.
తర్వాత హుబ్లీలో జరిగిన మేధావుల సదస్సులో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిసారు. కుష్టగి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ప్రచారం వివరాలు ఆయనకు వివరించారు. నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తామని తెలిపారు. ప్రచారం ఉధృతం చేయాలని వివేక్ వెంకటస్వామికి జేపీ నడ్డా సూచించారు.