బుద్ధున్నోడు ఎవడన్నా..ఇసుక మీద ప్రాజెక్టు కడ్తడా? : రేవంత్

బుద్ధున్నోడు ఎవడన్నా..ఇసుక మీద ప్రాజెక్టు కడ్తడా? : రేవంత్
  • కేసీఆర్​కు ఆకలి ఎక్కువ..ఆలోచన తక్కువ: రేవంత్
  • ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు మింగిండు.. అవన్నీ కక్కిస్తం 
  • దుర్గం చిన్నయ్యకు అమ్మాయిలు, భూకబ్జాలు కావాలె 
  • సింగరేణి భూములు, ఉద్యోగాలను బాల్క సుమన్ అమ్ముకున్నడు
  • మా సభలకు కరెంట్ కట్​ చేస్తరా.. డిసెంబర్ 3న మీ నరాలు కట్ అయితయ్ 
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టాదారు కాకా కుటుంబం
  • కాకా కృషితోనే సోనియా తెలంగాణ ఇచ్చిన్రు 
  • బెల్లంపల్లి, గోదావరిఖని, ధర్మపురి సభల్లో పీసీసీ చీఫ్

మంచిర్యాల / బెల్లంపల్లి / గోదావరిఖని / జగిత్యాల, వెలుగు : ఇసుక మీద కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘బుద్ధున్నోడు ఎవడన్నా ఇసుక మీద ప్రాజెక్ట్​ కడ్తడా? రెండు రూమ్​ల ఇల్లు కట్టుకోవాలన్నా పునాదులు తీస్తరు. ప్రాజెక్ట్ ​భూమి మీద ఎంత ఉంటదో, భూమిలో అంతకన్నా ఎక్కువ లోతు నుంచి పునాదులు తియ్యాలె. కానీ కేసీఆర్​కు ఆకలి ఎక్కువ.. ఆలోచన తక్కువ. ఇసుక మీద కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయింది. నాలుగు పిల్లర్లే కదా మళ్లా కడ్తం అంటున్నరు. కానీ అది మొత్తం కూలిపోతది” అని అన్నారు. శనివారం బెల్లంపల్లి, గోదావరిఖని

ధర్మపురిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ‘‘కాకా వెంకటస్వామి సూచనతోనే తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్టు నిర్మించి, ఆదిలాబాద్​జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని వైఎస్సార్ నిర్ణయించారు. కానీ కేసీఆర్​కు ఏం దెయ్యం పట్టిందో.. తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును కిందికి తీసుకెళ్లి మేడిగడ్డ దగ్గర కట్టిండు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.1.51 లక్షల కోట్లకు పెంచిండు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు మింగిండు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్​ తిన్నదంతా కక్కిస్తాం” అని చెప్పారు. 

కాంగ్రెస్​హయాంలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులు 50, 60 ఏండ్లుగా తుఫాన్లు వచ్చినా, సునామీలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాయని తెలిపారు. ‘‘కేసీఆర్​కు అధికారమిస్తే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కొడుకు, అల్లుడు మంత్రులు అయ్యిన్రు. బిడ్డ ఎమ్మెల్సీ అయ్యింది. ఇక మూడోసారి గెలిపిస్తే మనుమడిని కూడా మంత్రిని చేస్తడు” అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబీకులను ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేయడానికేనా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది? అని ప్రశ్నించారు.

‘‘ఉద్యోగాలు రాక 35 ఏండ్లు వచ్చినా యవకులు పెండ్లి చేసుకునే పరిస్థితి లేదు. పదో తరగతి మొదలు టీఎస్​పీఎస్సీ వరకు ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించని అసమర్థ సీఎం మనకు అవసరమా? ప్రజలు ఆలోచించాలి” అని కోరారు. బీఆర్ఎస్​వాళ్ల దగ్గర ఫుల్​బాటిల్, రూ.5 వేలు తీసుకుని ఓటేస్తే.. ఐదేండ్లు కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.  

గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించే పేరు కాకా.. 

గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే ఏకైక పేరు కాకా వెంకటస్వామిదని, ఆయన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని రేవంత్ అన్నారు. ‘‘పేద కుటుంబంలో పుట్టినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగవచ్చని కాకా నిరూపించారు. ఆయన కృషితోనే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులుగా గాంధీ కుటుంబం ఎలాగో.. తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కూడా అలాగే పట్టాదారు” అని చెప్పారు. ‘‘2004లో కాకా వెంకటస్వామి నాయకత్వంలో కరీంనగర్​లో జరిగిన సభలో తెలంగాణ ఇస్తానని సోనియా గ్యారంటీ ఇచ్చారు.

2014లో పార్లమెంట్​లో వివేక్​ వెంకటస్వామి కొట్లాడి తెలంగాణ తెచ్చారు. దేశంలో ఎక్కడికెళ్లినా కాకా పేరు చెబితే కుర్చీ వేసి కూర్చోపెడతారు. ఢిల్లీలోని తన ఇంటిని కాంగ్రెస్​పార్టీ ఆఫీసుకు కాకా ఇచ్చారు. ఆయన తనయులు వినోద్, వివేక్​ను ఎమ్మెల్యేలుగా గెలిపించి అసెంబ్లీకి పంపాలి. కాకా కుటుంబాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలి” అని ప్రజలను కోరారు.   

చిన్నయ్య, సుమన్ ను పాతిపెట్టాలె.. 

ఈ ఎన్నికల్లో బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూర్​లో బాల్క సుమన్ ను ఓడించి.. వాళ్లిద్దరినీ వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలని ప్రజలకు రేవంత్​పిలుపునిచ్చారు. ‘‘దుర్గం చిన్నయ్యకు అమ్మాయిలు, భూకబ్జాలు కావాలి. ఆయన దుర్మార్గాల గురించి దేశం మొత్తం తెలిసింది. ఆ సన్నాసిని తొలగించాల్సింది పోయి, టికెట్​ఇచ్చి మళ్లా గెలిపించాలని కేసీఆర్ సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారు” అని మండిపడ్డారు. ‘‘బెల్లంపల్లిలో కరెంట్ కట్ చేసినవ్ కదా.. డిసెంబర్​3 నాడు నీ నరాలు కట్​అయితయ్. నీ దుకాణం బంద్​ అయితది.

బెల్లంపల్లిలో నీ పప్పులు ఉడకవు’’ అంటూ చిన్నయ్యకు వార్నింగ్ ఇచ్చారు. ‘‘తన మీద నూరు కేసులు ఉన్నయని, వివేక్ కు వేల కోట్ల ఉన్నయని బాల్క సుమన్ అంటున్నడు. వివేక్ బిజినెస్ చేసి సంపాదించిండు. మరి బాల్క సుమన్​కు వేల కోట్లు ఎట్లొచ్చినయ్. సింగరేణి భూములు, ఉద్యోగాలు అమ్ముకున్నడు. హైదరాబాద్​లో భూములు కబ్జా చేసిండు” అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ఎవరిని చూసినా కబ్జాలు, దోపిడీలేనని మండిపడ్డారు. 

సింగరేణి నిధులు దోచుకున్నడు.. 

సింగ‌‌రేణి కార్మికులకు కేసీఆర్ అన్యాయం చేశారని రేవంత్ అన్నారు. 8 ఏండ్లు ఒకే వ్యక్తిని సీఎండీగా కొన‌‌ సాగిస్తూ సంస్థ నిధుల‌‌ను దోచుకుంటున్నార‌‌ని ఆరోపించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో సింగ‌‌రేణి కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాడారు. కానీ కార్మి కులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. కారుణ్య నియామ‌‌కాల పేరిటవేల కోట్లు దోచుకున్నారు. ఇన్​కమ్ ట్యాక్స్ రద్దు చేయిస్తామని, ఇండ్లు కట్టిస్తామని చెప్పి మాటతప్పారు. సింగ‌‌రేణి నిధులను గ‌‌జ్వేల్‌‌, సిరి సిల్ల, సిద్దిపేటకు త‌‌ర‌‌లించారు” అని ఫైర్​ అయ్యారు. కేసీఆర్ ఓట‌‌మి భ‌‌యంతోనే సింగ‌‌రేణి ఎన్నిక‌‌ల‌‌ను వాయిదా వేయించార‌‌న్నారు.

కాంగ్రెస్‌‌ అధికారంలోకి వ‌‌స్తే అండ‌‌ర్ గ్రౌండ్ మైన్‌‌ల‌‌ను ఓపెన్ చేయిచి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు అమ్ముకుని నిరుద్యోగుల చావులకు కారణమైండని.. ఎన్టీపీసీ బూడిద, ఇసుక దందాల‌‌తో వేల కోట్లు కూడ‌‌బెట్టుకుని బందిపోటుగా మారిండని విమ‌‌ర్శించారు. 

ఈవీఎంలను మార్చి కొప్పుల గెలిచిండు.. 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ‘‘ఈ సీజన్​లో కల్లాల్లో వడ్లు కొనేటోళ్లే లేరు. కానీ కేసీఆర్​ఫామ్ హౌస్ లో 200 ఎకరాల్లో పండించిన వడ్లను వారం రోజులుగా కావేరి సీడ్స్ కంపెనీ కొంటున్నది. తన వడ్లను క్వింటాల్ రూ.4,250కి కేసీఆర్ అమ్ముకుంటున్నడు. కేసీఆర్ వడ్లలో బంగారాం ఉందా? మా రైతుల వడ్లలో మట్టి ఉందా?” అని ప్రశ్నించారు.

‘పోయినసారి ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్​ను ప్రజలు ఆభిమానంతో గెలిపిస్తే, కేసీఆర్ అండతో మంత్రి కొప్పుల ఈవీఎంలను మార్చి అక్రమంగా గెలిచారు” అని అన్నారు. ధర్మపురికి కొప్పుల చేసిందేం లేదని విమర్శించారు. కాగా, ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ను రీఓపెన్ చేయించ‌‌డంలో వివేక్ వెంక‌‌ట‌‌స్వామి కీల‌‌క పాత్ర పోషించార‌‌ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేద్దాం : వివేక్ 

రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ప్రజలకు పిలుపు నిచ్చారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ ​భగీరథ పథకాల్లో కేసీఆర్​ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ ​చుట్టుపక్కల వేల ఎకరాలు దోచుకున్నారు. కేసీఆర్ రాక్షస పాలన ను, చెన్నూర్​లో బాల్క సుమన్ గూండా రాజ్​ను అంతమొందించాలి” అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి స్థలాల్లో ఉంటున్న వాళ్లకు పట్టాలు ఇస్తామని, రిటైర్డ్​ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

‘‘సింగ‌‌రేణి సంస్థ కోసం నా తండ్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారు. దాదాపు 400 కోట్ల మారటోరియం‌‌ ఇప్పించి, సుమారు ల‌‌క్ష మంది ఉద్యోగులు రోడ్డున ప‌‌డ‌‌కుండా కాపాడారు. రామగుండంలో 20 వేల ఇండ్లు పట్టాలు ఇప్పించారు. ఆర్ఎఫ్‌‌సీఎల్ రీ ఓపెనింగ్ కోసం నేను తీవ్రంగా కృషి చేసి రూ.10 వేల కోట్ల రుణ‌‌మాఫీ చేయించాను. ఆ సంస్థలో స్థానికులకే ఉద్యోగాలు రావాల‌‌ని కొట్లాడితే.. లోకల్ ఎమ్మెల్యే వాటిని అమ్ముకుని నిరుద్యోగుల చావులకు కారణమైండు” అని అన్నారు.  

బెల్లంపల్లిలోనే ఇల్లు కట్టుకుంట : వినోద్  

కేసీఆర్​కు సోనియాగాంధీ దగ్గర అపాయింట్​మెంట్​దొరక్కుంటే, తన తండ్రి కాకా వెంకటస్వామి ఇప్పించారని వినోద్ చెప్పారు. తన తండ్రి సింగరేణిని బీఐఎఫ్ఆర్​నుంచి కాపాడి 84 వేల మంది కార్మికులను లాభం చేస్తే.. కేసీఆర్ మాత్రం సింగరేణిలో 50 వేల మంది కార్మికులను ఇంటికి పంపారని మండిపడ్డారు. ‘‘నేను బెల్లంపల్లిలోనే ఇల్లు కట్టుకుని, ఇక్కడి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. అందుకే భార్యా బిడ్డలను కూడా తీసుకొచ్చాను” అని తెలిపారు. 

ఆరు గ్యారంటీలతో  పేదలకు 10 లక్షల లాభం.. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని రేవంత్ చెప్పారు. ఈ ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఐదేండ్లలో రూ.10 లక్షల లాభం జరుగుతుందని తెలిపారు. ‘‘కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నడు. మొదట 2004లో 9గంటల ఉచిత విద్యుత్​ఇచ్చిందే కాంగ్రెస్. ఉచిత కరెంట్​పేటెంట్​కాంగ్రెస్ పార్టీదే. ఈసారి అధికారంలోకి రాగానే 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్​ఇస్తాం. ఇక ధరణి తీసేస్తే రైతుబంధు బందైతదని కేసీఆర్ మతిమరుపుతోనో, మందేసే మాట్లాడుతున్నడు. 2017లో రైతుబంధు స్టార్టయింది. ధరణి 2020లో వచ్చింది.

మరి రైతుబంధు ఎట్ల బందైతది’’ అని ప్రశ్నించారు. తాము పవర్ లోకి రాగానే ధరణి కంటే మెరుగైన విధానం తీసుకొస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ఆదిలాబాద్ అత్యంత వెనుకబడిన జిల్లా. ఆదిలాబాద్ పై నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది. నేను పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత దళిత, గిరిజనుల దండోరా ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టిన. అధికారంలోకి రాగానే ఆదిలాబాద్​ను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తా” అని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ అంతటా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.