కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు : వివేక్ వెంకటస్వామి
  • కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు 
  • కరెప్షన్ లో​ఆయన్ను మించినోడు దేశంలోనే లేడు
  • 12 గంటలు సోదాలు చేసి అధికారులు ఖాళీచేతులతో వెళ్లిన్రు
  • చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్ : సీఎం కేసీఆర్​అంత అవినీతిపరుడు దేశంలోనే లేడని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఓటమి భయంతోనే బాల్క సుమన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి తన ఇంటి, ఆఫీసులపై ఐటీ రెయిడ్స్ చేయించారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరూ మండలం సుబ్బరావ్ పల్లి, రాయి పేట, నారాయణ పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చెన్నూర్ కు సమీపంలో ఉన్న సుబ్రంపల్లి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట నష్టం జరిగిన.. ఇండ్లు మునిగిన బాల్క సుమన్ బాధితులను ఆదుకోలేదు. ఇసుక దందా తప్ప ఆయనకు ప్రజల ఇబ్బందులు పట్టవు. కాళేశ్వరంలో కేసీఆర్ రూ.70 వేల కోట్లు దండు కుంటే.. దత్త పుత్రుడు బాల్క సుమన్ ఇసుక దందాలో వేయి కోట్లు కొల్లగొట్టిండు. ఎన్నికల్లో వారిద్దరూ ఓడిపోతున్నరు. ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంగానే నాపై ఐటీ దాడులు జరిగాయి.12 గంటలు మా ఇంట్లో సోదాలు చేసి ఖాళీచేతులతో అధికారులు వెళ్లిన్రు. కేసీఆర్ కు దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి. ఐటీ, ఈడీ దాడుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉంది. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ పై ఎందుకు విచారణ చేయలేదు? కవిత లిక్కర్ స్కాం కేసు ఏమైంది? ఆధారాలు ఇచ్చినా అమిత్ షా ఎందుకు సైలెంట్ గా ఉన్నడు. కాంగ్రెస్ పార్టీ రైతులకు, కౌలు రైతులకు పెద్దపీట వేస్తోంది. రైతుని కోటీశ్వరుడిని చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకోలే. కేసీఆర్, మోదీ కారణంగానే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి’ అని వివేక్​ఫైర్​అయ్యారు.

వివేక్ కాన్వాయ్ చెకింగ్

చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి కాన్వాయిని పోలీసులు తనిఖీ చేశారు. మంచిర్యాల నుంచి చెన్నూరులో ప్రచారం కోసం ఆయన తన కాన్వాయ్ తో బయలుదేరారు. నస్పూర్ మండలం సీసీసీ క్రాస్ వద్ద పోలీసులు వాహనాలను ఆపి చెక్​చేశారు. వివేక్ కారుతో పాటు కాన్వాయ్ లో ఉన్న కార్యకర్తలు, మీడియా వాహనాలను సైతం తనిఖీ చేశారు. నిన్న వివేక్ నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మళ్లీ  కాన్వాయ్​ని తనిఖీ  చేయడంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ లో భాగంగా తనిఖీ చేశామని పోలీసులు చెప్పారు.

మహబూబాబాద్ లో నిరసన 

మహబూబాబాద్ : చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంటిపై జరిగిన ఐటీ దాడులను మాలమహానాడు ఖండించింది. ఈమేరకు రాష్ట్ర ఆధ్యక్షుడు పిల్లి సుధాకర్  ఆధ్వర్యంలో మహబూబాబాద్​లో నిరసన కార్యక్రమం చేపట్టారు. వివేక్ గెలుపును జీర్ణించుకోలేకనే ఐటీ,ఈ ఈడీ రెయిడ్స్​చేశారని, అలాంటివాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బెదిరింపులకు భయపడమని సుధాకర్ స్పష్టంచేశారు.