బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావు: వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ఖేల్ ఖతం.. ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావు: వివేక్ వెంకటస్వామి
  •  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది
  •  చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయ్యిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావని పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మంచిర్యాలలోని తన నివాసంలో బెల్లంపల్లి, మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఏఐసీసీ అబ్జర్వర్ మహేష్ జోషితో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.70 వేల కోట్లు,మిషన్ భగీరథలో రూ.40వేల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. చిన్న రాష్ట్రాలు ఉంటే ప్రజలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. కేవలం కేసీఅర్ కుటుంబమే బాగు పడిందన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో వేలాది ఎకరాల్లో పంటనష్టం జరుగుతోందని, రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు. తుగ్లక్ ముఖ్యమంత్రి తప్పుడు డిజైన్ వల్లే మంచిర్యాల జిల్లా బ్యాక్ వాటర్ లో మునుగుతోందని విమర్శించారు. తుమ్మిడిహీట్టి ప్రాజెక్ట్ కడితే జీరో గ్రావిటీతో లక్షల ఎకరాలు సాగయ్యేవని తెలిపారు.

 మంథని రైతులకు రూ.10 వేల వరద సాయం ఇస్తే.. మంచిర్యాల రైతులకు ఒక్క రూపాయి కూడా సహాయం ఇవ్వలేదన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సాండ్, ల్యాండ్, కోల్ దందాలు చేసి వేల కోట్లు దోచుకున్నాడని అన్నారు. ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకే తాను ఎమ్మెల్యేగా బరిలోకి దిగానని చెప్పారు.  ఏఐసీసీ అబ్జర్వర్ మహేష్ జోషి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు.  ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ..  జిల్లాలో కలిసికట్టుగా పనిచేసి మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. వినోద్ మాట్లాడుతూ..  బెల్లంపల్లి, చెన్నూరు అభ్యర్థులు సూట్ కేసులతో వచ్చారన్న కేసీఆర్ కామెంట్లను ఖండించారు. తాము బిజినెస్ చేసి సంపాదించామని, కేసీఆర్ లా రాష్ట్రాన్ని దగా చేసి దోచుకోలేదని ఫైర్ అయ్యారు. సమావేశంలో  నూకల రమేష్, న్యాతరి స్వామి తదితరులు పాల్గొన్నారు.