సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు ఇప్పిస్తం: వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు ఇప్పిస్తం: వివేక్ వెంకటస్వామి
  • అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి: వివేక్​ వెంకటస్వామి
  • కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వకుండా సర్కార్ డ్రామా చేస్తున్నది
  • కార్మికుల సంక్షేమ అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తామని హామీ

నస్పూర్​/కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి చేస్తామని, కార్మికులకు సంస్థ ద్వారా ఇన్​కమ్​టాక్స్ మినహాయింపు ఇప్పిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి హామీ ఇచ్చారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ఏరియాలోని ఆర్కే-5 బొగ్గు గనిపై బీఎంఎస్​ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్​మీటింగ్​లో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు రెండు లక్షల వరకు ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు ఇప్పించానని గుర్తు చేశారు. 1995లో సింగరేణి అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు ఇప్పించి.. లక్ష మంది కార్మికుల జీవితాలను తమ తండ్రి, కేంద్ర మాజీ మంత్రి కాక వెంకటస్వామి కాపాడారని చెప్పారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికుల ఇన్​కమ్​టాక్స్​మినహాయింపు, కోల్ ఇండియాలో ఉన్నట్టు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కూడా జీతాలు, సౌకర్యాలు కల్పించడం, కార్మికులకు రెండు గుంటల భూమి ఇవ్వడం, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్​స్థాయి స్కూల్, విద్య, వైద్యం ఫ్రీగా అందించే అంశాలను పొందుపరుస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరిస్తుందని బీఆర్ఎస్, టీబీజీకేఎస్​లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్​అయ్యారు. సింగరేణిలో రాష్ట్రానికే ఎక్కువ వాటా ఉందని.. తక్కువ వాటా కలిగిన కేంద్రం ఎలా సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తుందని ప్రశ్నించారు.

ఇన్సెంటివ్​ చెల్లించకుండా..

కార్మికుల కష్టంతో వచ్చిన లాభాల్లోంచి కార్మికుల వాటా ఇన్సెంటివ్ చెల్లించకుండా రాష్ట్ర సర్కార్ డ్రామా చేస్తున్నదని వివేక్ వెంకటస్వామి ఫైర్​అయ్యారు. లాభాల వాటా చెల్లింపుకు సింగరేణి యాజమాన్యం ఈనెల 4న ఆర్డర్ జారీ చేసిన ఇప్పుటి వరకు ఇవ్వలేదన్నారు. ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్​ తీసుకొని మేమే ...లాభాల వాటాను ఇప్పిస్తున్నామనే భావన వర్కర్స్​లో కన్పించేలా సీఎం కేసీఆర్ ఒక డ్రామాను నడుపుతున్నారన్నారని ఆరోపించారు. వెంటనే కార్మికులకు లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోజుకు 37 కి.మీ. చొప్పున ఏడేండ్లలో 58వేల కి.మీ హైవేలను నిర్మించడం గొప్ప విషయమన్నారు. సింగరేణి కార్మికులు బీజేపీకి ఓట్లువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాఘునాథ్​ వెరబెల్లి మాట్లాడుతూ.. గత సింగరేణి ఎన్నికల టైమ్​లో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం సభలో సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాలను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అనంతరం వివేక్​ వెంకటస్వామి కార్మికులను పలకరించి సింగరేణిలో పరిస్థితులు అడిగితెలుసుకున్నారు. సమావేశంలో బీఎంఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేశ్, బీజేపీ, బీఎంఎస్ నేతలు అందుగుల శ్రీనివాస్, అక్కల రమేశ్, కాదాస భీమయ్య, నాతాడి శ్రీధర్ రెడ్డి, నరేశ్, సందీప్, జీడీ ప్రభాకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.