ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలె

V6 Velugu Posted on Sep 25, 2021

మంచిర్యాల, వెలుగు: మూడేండ్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల చెన్నూర్ నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఎంతోమంది రైతులు నష్టపోతున్నారని బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఆత్మహత్య చేసుకున్న రాజేశ్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు మునిగి నష్టపోయిన మిగతా రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ‘‘ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. లేదా ఎకరం రూ.20 లక్షల చొప్పున ముంపు భూములను ప్రభుత్వం సేకరించాలని మేం పోరాడుతున్నాం. కలెక్టరేట్ ఎదుట రైతులతో ధర్నాలు చేసి వినతిపత్రాలు ఇచ్చినం. ఆగస్టులో కోటపల్లి మండలం అన్నారం నుంచి కలెక్టరేట్ దాకా మూడ్రోజులు పాదయాత్ర చేపట్టినం. ఈ మధ్యే హైదరాబాద్‌‌లోని ఇందిరాపార్క్ దగ్గర రైతు పోరు దీక్ష చేసినం. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు’’ అని శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. హుజూరాబాద్ బై పోల్‌‌ ప్రచారంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బిజీగా ఉన్నారని.. తన నియోజకవర్గంలోని రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకునే తీరిక ఆయనకు లేదని విమర్శించారు.

బీజేపీ నేతల నిర్బంధం

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌‌‌‌లో పంట మునగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కమ్మల రాజేశ్​(28) డెడ్‌‌ బాడీకి హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించి.. అంత్యక్రియలు జరిపించారు. బాధితులను పరామర్శించేందుకు బీజేపీ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. రాజేశ్ మృతదేహంతో బీజేపీ లీడర్లు ధర్నా చేస్తారనే నెపంతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే పోలీసులు నిఘా పెట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంచిర్యాల నుంచి చెన్నూర్​కు వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్‌‌లను ఇందారం క్రాస్​రోడ్డు దగ్గర జైపూర్ ఎస్సై రామకృష్ణ అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. చెన్నూర్‌‌‌‌కు చెందిన నేతలు నాగునూరి వెంకటేశ్వర్లుగౌడ్, రాపర్తి వెంకటేశ్వర్, సుశీల్​కుమార్, కొంపెల్లి బానేశ్, చింతల శ్రీనివాస్, పెండ్యాల శ్రీకాంత్, గడ్డం మహేశ్, దమ్మ సంజయ్‌‌లను కోటపల్లి పోలీస్ స్టేషన్​లో నిర్బంధించారు.

అవి సర్కారు హత్యలే

కాళేశ్వరం ముంపు రైతుల ఆత్మహత్యలు సర్కారు హత్యలేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు ఆరోపించారు. మూడేండ్ల నుంచి కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్ వాటర్ వల్ల చెన్నూర్ నియోజకవర్గంలో 10 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. బ్యాక్ వాటర్‌‌‌‌తో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు అడుగుతుంటే.. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాత్రం భూములు అమ్ముకోమంటున్నాడని అందుగుల శ్రీనివాస్​ అన్నారు. సుందరశాలలో ఎకరం రూ.20 లక్షల విలువైన భూములను రూ.3 లక్షలకు అమ్మితే కొంటానని అంటున్నాడని ఆరోపించారు.

నేరస్తుడు కేసీఆర్ కాదా? : రేవంత్

కాళేశ్వరం బ్యాక్ వాటర్‌‌‌‌ వల్ల మూడేళ్లుగా పంటలు మునిగిపోతుండటంతో మనస్థాపానికి గురై రైతు రాజేశ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘పొలాల్లో పారాల్సిన నీరు పేదల కంటి వెంట జాలు వారుతుంటే.. పరిహారం ఇవ్వాల్సిన పాలకుడు నిమ్మకునీరెత్తినట్టు ఉంటే.. యువరైతు రాజేశ్ ఆత్మహత్యలో నేరగాడు కేసీఆర్ కాదా!? ఇప్పటికైనా స్పందిస్తారా? మరో రైతు ఊపిరిపోకుండా చూస్తారా!?” అని ట్వీట్ చేశారు.

నేడు గవర్నర్‌‌‌‌ వద్దకు వివేక్‌‌

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యాక్‌‌ వాటర్‌‌‌‌ ముంపు రైతులతో కలిసి మాజీ ఎంపీ, బీజేపీ స్టేట్‌‌ కోర్‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌ వివేక్‌‌ వెంకటస్వామి శనివారం ఉదయం 9.30 గంటలకు రాజ్‌‌ భవన్‌‌లో గవర్నర్‌‌‌‌ తమిళిసైని కలవనున్నారు. కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌‌‌‌తో పంట నీట మునిగి నష్టపోవడంతో చెన్నూరుకు చెందిన యువ రైతు రాజేశ్‌‌ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆయన గవర్నర్‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
 

Tagged crops, Damage, Vivek Venkataswamy tweet , Chennur constituency, Kaleswaram project backwaters

Latest Videos

Subscribe Now

More News