ప్రపంచానికి విపత్తు తప్పదు : పుతిన్

ప్రపంచానికి విపత్తు తప్పదు : పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. నాటో దళాలు రష్యా సైన్యంతో తలపడితే..ప్రపంచ విపత్తు తప్పదని హెచ్చరించారు.  కజికిస్థాన్‌ రాజధాని అస్టానాలో పూర్వ సోవియట్‌ దేశాల సదస్సులో మాట్లాడిన పుతిన్‌.. నాటో దళాలు రష్యా ఆర్మీతో  డైరెక్ట్ గా  యుద్ధానికి వస్తే రష్యా తర్వాతి వ్యూహం అత్యంత ప్రమాదకరంగా ఉంటుందన్నారు. ఇది మహా విపత్తుకి దారి తీయొచ్చన్నారు.  దీని గురించి నాటో దళాలు తెలివిగా ఆలోచిస్తారని భావిస్తున్నట్లు పుతిన్ స్పష్టం చేశారు. 

ఉక్రెయిన్ నాశనం లక్ష్యం కాదు..

ఉక్రెయిన్‌ సంక్షోభంపై తనకు ఎటువంటి పశ్చాత్తాపం లేదని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి కరెక్టేనని అన్నారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్ పై భారీ దాడులు చేయాల్సిన అవసరం లేదన్నారు.  ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం ఆహార ధాన్యాల కోసం ఏర్పాటు చేసిన హ్యుమానిటేరియన్‌ కారిడార్లను మూసివేస్తామని పుతిన్‌ హెచ్చరించారు. 

చర్చలకు సిద్ధమే..

ఉక్రెయిన్ తమతో చర్చలను తిరస్కరిస్తోందని పుతిన్ చెప్పారు. తాము చర్చలను కోరుకుంటున్నామని చెబుతూ వచ్చిన కీవ్ ప్రభుత్వం..ప్రస్తుతం ఆ చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేసిందన్నారు. పుతిన్‌తో ఎలాంటి చర్చలు జరపబోమని జెలెన్‌స్కీ  స్పష్టం చేసినట్లు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతియుత చర్చలకు భారత్, చైనా దేశాలు మద్దతిచ్చాయని తెలిపారు. ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యాతో కాకుండా మరో దేశంతో చర్చలు జరుపుతోందన్నారు. ఉక్రెయిన్‌ వైఖరి మారితే టర్కీతో సహా ఇతర దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఎవరి మాట వినని పుతిన్..

ఉక్రెయిన్ పై రష్యా కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగిస్తోంది.  ఎన్ని దేశాల హెచ్చరించినా.. ఐక్యరాజ్య సమితి వారించినా కూడా పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదు. అటు ఉక్రెయిన్ కూడా గట్టిగానే పోరాడుతోంది. రష్యా ఆక్రమిత ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నాటో దళాలు కూడా రష్యాను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగనున్నాయన్న వార్తలు వినిపించడంతో..పుతిన్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.