ఓట్ చోర్.. గద్దె దిగాలి.. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం తొక్కిన ఇండియా కూటమి

ఓట్ చోర్..  గద్దె దిగాలి.. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలో కదం తొక్కిన ఇండియా కూటమి
  • రాహుల్​ గాంధీ ఆధ్వర్యంలో 300 మంది ఎంపీల నిరసన
  • పార్లమెంట్​ నుంచి ఈసీ ఆఫీసు వరకు భారీ ర్యాలీ
  • అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే బైఠాయింపు.. తీవ్ర ఉద్రిక్తత
  • స్పృహతప్పిన టీఎంసీ ఎంపీలు  మహువా మొయిత్రా, మితాలి బాగ్ 
  • ఖర్గే, రాహుల్​, ప్రియాంక సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్​
  • సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్​కు తరలింపు.. అనంతరం విడుదల
  • ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, కడియం కావ్య, సురేశ్​ షెట్కార్​ తదితరులు

న్యూఢిల్లీ, వెలుగు: ఓట్​ చోరీ, సర్​కు వ్యతిరేకంగా లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు సోమవారం ఢిల్లీలో కదం తొక్కారు. పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్  వ‌ర‌కు భారీ ర్యాలీ చేపట్టారు. లోక్​సభ, రాజ్యసభ సభ్యులు దాదాపు 300 మంది ఇందులో పాల్గొన్నారు.  2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌లో ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట అక్రమాలకు తెగబడుతున్నారని ఎంపీలు మండిపడ్డారు.  ‘ఓట్​ చోర్​..  గద్దె దిగాలి’ అంటూ మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.  పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.  ఇద్దరు టీఎంసీ ఎంపీలు స్పృహతప్పి  పడిపోయారు. కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలను  పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్​ను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలోని పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు.

రాహుల్​ ముందు నడువగా..!
పార్లమెంట్ లోని మకర ద్వార్  వద్ద జాతీయ గీతం ఆలపించిన తర్వాత ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘం హెడ్ ఆఫీస్  (నిర్వచన్ సదన్)  వైపు ర్యాలీ చేపట్టారు. ‘సర్’, ‘ఓట్​ చోరీ’ అని రాసి ఉన్న ఎర్రని గీతలతో కూడిన తెల్లని క్యాప్​లను ధరించి ర్యాలీలో  పాల్గొన్నారు. “సర్​+ ఓటు దొంగతనం = ప్రజాస్వామ్య హత్య”  అని రాసి ఉన్న బ్యానర్లతో ముందుకు కదిలారు. ర్యాలీలో రాహుల్ గాంధీ ముందు నడవగా... ఆయన వెంట తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీలు ముందుకు నడిచారు. ట్రాన్స్ పోర్ట్ భవన్ మీదుగా   ర్యాలీగా సాగింది.  ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) బిల్డింగ్​ ముందుకు రాగానే.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  అక్కడే రోడ్డుపై బైఠాయించారు. 

బారికేడ్లను తోసుకుంటూ..!
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్ తోసుకుంటూ ముందుకు సాగారు. మిగతా ఎంపీలు కూడా అదే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. తృణమూల్ ఎంపీలు మహువా మొయిత్రా, సుష్మితా దేవ్, కాంగ్రెస్ సభ్యులు సంజనా జాతవ్, జోతిమణి వంటివారు బారికేడ్లపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేసి బస్సుల్లో సంస‌‌‌‌ద్ పోలీస్​ స్టేష‌‌‌‌న్‌‌‌‌కు త‌‌‌‌ర‌‌‌‌లించారు. మధ్యాహ్నం 2. 30 గంటల ప్రాంతంలో విడుదల చేశారు.

స్పృహ కోల్పోయిన మహువా, మితాలి బాగ్
పోలీసులు, ఎంపీలకు మధ్య జరిగిన తోపులాట కారణంగా పలువురు ఎంపీలకు గాయాలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు  మహువా మొయిత్రా, మితాలి బాగ్ - స్పృహ తప్పి పడిపోయారు. వీరికి రాహుల్ గాంధీ, తోటి ఎంపీలు నీళ్లు, ప్రథమ చికిత్స అందించారు. అయితే మితాలి బాగ్‌‌‌‌ పరిస్థితి కొంచెం సీరియస్ గా కనిపించడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, ర్యాలీలో శరద్ పవార్ (ఎన్సీపీ–ఎస్పీ) , అఖిలేశ్ యాదవ్ ( సమాజ్​వాదీ పార్టీ),  టీఆర్ బాలు (డీఎంకే), సంజయ్ రౌత్ (ఎస్ఎస్-–యూబీటీ), డెరెక్ ఓ'బ్రెయిన్ (టీఎంసీ) సహా డీఎంకే, ఆర్జేడీ, వామపక్ష పార్టీల ఎంపీలు సహా దాదాపు 300 మంది పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్​ ఎంపీలు మల్లు రవి, సురేశ్​ షెట్కార్​, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, రఘురాం, బలరాం నాయక్​, అనిల్​ కుమార్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.

30 మందికే అనుమతి: ఈసీ 
బిహార్ లో చేపట్టిన ‘సర్’​సహా పలు అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ రాసిన లేఖకు ఎన్నికల కమిషన్​ స్పందిస్తూ.. 30 మంది ఎంపీలు మాత్రమే మీటింగ్‌‌‌‌కు రావాలని తెలిపింది. 30 మంది మాత్రమే ర్యాలీగా వెళ్లాలని ఢిల్లీ పోలీస్​ డీసీపీ దేవేశ్​ కుమార్ మహలా కూడా చెప్పారు. ఇందుకు ప్రతిపక్ష ఎంపీలు ఒప్పుకోలేదు.  అంద‌‌‌‌రం ఎన్నిక‌‌‌‌ల క‌‌‌‌మిష‌‌‌‌న్ కార్యాల‌‌‌‌యం వ‌‌‌‌ర‌‌‌‌కు వెళ్తామ‌‌‌‌ని.. అక్కడి నుంచి 30 మంది ఎంపీలు లోప‌‌‌‌లికి మీటింగ్​కు వెళ్తారని తేల్చిచెప్పారు.  త‌‌‌‌మ‌‌‌‌ను ఎన్నిక‌‌‌‌ల క‌‌‌‌మిష‌‌‌‌న్ కార్యాల‌‌‌‌యం వ‌‌‌‌ర‌‌‌‌కు వెళ్లేందుకు  అనుమ‌‌‌‌తించాల‌‌‌‌ని కోరారు. దీనికి పోలీసులు స‌‌‌‌సేమీరా అన‌‌‌‌డంతో ఎంపీలు త‌‌‌‌మ ప్రద‌‌‌‌ర్శన‌‌‌‌ను ముందుకు కొన‌‌‌‌సాగించారు. 

దౌర్జన్యాన్ని సహించం: వంశీకృష్ణ
మోదీ సర్కార్​ దౌర్జాన్యానికి దిగుతున్నదని, సహించేది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష ఎంపీలు ఈసీని కలవడవానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటని ఆయన ఫైర్ అయ్యారు. శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న తమను అక్రమంగా పోలీసులు నిర్బం ధించార ని అన్నారు. ర్యాలీలో పాల్గొ న్న గడ్డం వంశీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఓట్ చోరీకి పాల్పడి కేంద్రంలో గద్దెపై కూర్చున్నారని, వాళ్లను గద్దె దింపి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ఆయన అన్నారు. నియంతృత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. 

జనం ముందు సాక్ష్యాలు పెట్టినం
‘‘ఇది రాజకీయ పోరాటం కాదు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమం. ఓట్​ చోరీ సాక్ష్యాలను జనం ముందు ఉంచాం. మాకు చివరి ఏడు ఎన్నికల ఓటర్ లిస్ట్ కావాలని ఈసీని డిమాండ్​ చేస్తున్నం. లోక్​సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల దొంగతనాన్ని ఈసీ దాచాలని చూసినా.. అది దాగదు. మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి’’.


రాహుల్​ గాంధీ, లోక్​సభ ప్రతిపక్ష నేత